వైసిపి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి అనుకూల మీడియా లో ప్రభుత్వానికి, జగన్ కు సంబంధించి వ్యతిరేక కథనాలు ఎప్పుడూ హైలెట్ అవుతూ వస్తున్నాయి. జనాల్లో జగన్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా అనేక కథనాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తుండడం పై మొదటి నుంచి జగన్ సీరియస్ గానే దృష్టి పెట్టి, వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు విధించి , అదుపుచేసే ప్రయత్నం చేసినా, ఈ తరహా కథనాలకు ఎక్కడా పులిస్టాప్ పడలేదు సరికదా మరింతగా జగన్ ప్రభుత్వం పై ఎదురుదాడి జరుగుతూనే వస్తోంది.
కేవలం టిడిపి అధినేత చంద్రబాబు చేసే విమర్శలకు సంబంధించిన వార్తలను హైలైట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను పట్టించుకోకుండా,, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ వస్తుండడం పై జగన్ సీరియస్ గానే ఉన్నారు. తాజాగా జగన్ తమకు వ్యతిరేకంగా ఉన్నా, మీడియాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ మేరకు ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీలు, కలెక్టర్ లతో జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాల ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది.
ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న బాబు అనుకూల మీడియా తో మనం పోరాడుతున్నామని, వారు మానసికంగా వ్యతిరేక ధోరణి తో ఉన్నారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అనుకూల మీడియా లో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక వార్తలు వచ్చినా, వాటిని చదువుదామని, వాటిలో ఏవైనా లోపాలుంటే తప్పులు సరి చేసుకుందామని ,ఒకవేళ తప్పు జరగకపోయినా జరిగినట్లుగా కథనాలు ఉంటే, దానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇటువంటి తప్పుడు కథనాలపై లీగల్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైన జగన్ కొన్ని కీలక సూచనలు అధికారులకు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని, వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విషయంపై కలెక్టర్లు ఎస్పీలు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. జగన్ వ్యవహారం చూస్తే తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థల పై ఉక్కుపాదం మోపేలా కనిపిస్తున్నారు.
-Surya