గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో వినిపిస్తున్న మాట ఇది. “మళ్లీ ఎన్నికల కోసం 2024 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపే ఎన్నికలు రావొచ్చు! ఖచ్చితంగా మనం గెలుస్తాం. ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు. మనకు పట్టం కట్టేందుకు రెడీ అయ్యారు“- ఇదీ మహానాడు అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు. అయితే, అప్పట్లో వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు కూడా పలు టీవీ ఛానెళ్ల డిబేట్లలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. “ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు పెట్టేందుకుకేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇదే జరిగితే.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఒక వేళ నేరుగా అధికారంలోకిరాకపోయినా.. మా మద్దతుతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది“అని వారు చెప్పుకొస్తున్నారు.
‘దీంతో రాష్ట్రంలో మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయంపై చర్చిస్తున్నారు. జమిలి ఎన్నికలకు అవకాశం ఉందా? అనే కోణంలో దృష్టి పెట్టారు. వాస్తవానికి 2018లోనే ఈ తరహా ప్రచారం ముందుకు వచ్చింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ఆయన కీలక అనుచరుడు, ప్రస్తుత హొం మంత్రి అమిత్ షాలు కూడా జమిలి ఎన్నికలపై ఆలోచన చేస్తున్నారని, జమిలి ఎన్ని కల నిర్వహణకు రెడీ అవుతున్నారని కూడా జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనికి కారణాలు కూడా వివరించే ప్రయత్నం చేసింది. జమిలి ఎన్నికలతో దేశంలో ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చని, ప్రభుత్వాలను కూడా ఒకే సారి ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషణలు సాగాయి.
అయితే, అప్పట్లో ఆ ప్రతిపాదన గాలి బుడగ మాదిరిగా పేలి పోయింది. యథాలాపంగా 2019లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఇక, ఇప్పుడు మళ్లీ జమిలి ఎన్నికలు వస్తాయని, జగన్ ప్రభుత్వానికి కూలిపోయే సమయం వచ్చిందని ప్రచారం జోరుగా సాగు తోంది. నిజానికి అప్పట్లో జమిలి అంటే ఏవగించుకున్న, వ్యతిరేకించిన చంద్రబాబు.. అండ్ కోలు ఇప్పుడు మాత్రం జమిలి కోసం వెంపర్లాడుతున్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలోనే కాదు.. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న క్రమంలో జమిలికి సాధ్యం లేదనేది రాజకీయ నిపుణుల మాట.
ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి. దానిని పార్లమెంటు కు సమర్పించి చర్చించాలి. ఇదో పెద్ద తతంగం. పైగా చాలా రాష్ట్రాల్లో బీజేపీనే సంకీర్ణ సర్కారులను నిర్వహిస్తోంది. ఒంటరిగా బరిలో నిలిచి నెగ్గే సత్తా కూడా ఆపార్టీకి లేదు. ఈ నేపథ్యంలో జమిలి అంటూ..ఉన్న పదవీ సమయాన్ని కుదించుకునే ప్రయత్నం చేస్తుందనేది ఒట్టి అపోహేనని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఇదీ సంగతి. జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టే యోచనే తప్ప.. దీనిలో విషయంలేదనేది వాస్తవం అంటున్నారు. మైండ్ గేమ్‌లో ఇదీ ఒక భాగమని చెబుతున్నారు. కాబట్టి జమిలి అనేది ఒక చర్చ మాత్రమే! అంతే తప్ప నిజం కాదన్నమాట!!