అధికారికంగా ఉన్నది 23మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు. అనధికారికంగా ప్రస్తుతానికి ఉన్నది 20 మంది ఎమ్మెల్యేలు! ఎవరు ఎప్పుడు సైకిల్ దిగిపోతారో తెలియని పరిస్థితి. అసలు ఏపీలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ. జగన్ అనుకుంటే ఆగస్టు 9 – 15 మధ్యకాలంలో ఆ విషయంపై కూడా క్లారిటీ రావొచ్చు! ఇదే సమయంలో ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ కూడా బాబుకు ముచ్చెమటలు పట్టిస్తోన్న పరిస్థితి. ఇలాంటప్పుడు పార్టీలో సమరోత్సాహం నింపడానికి, పూర్వవైభవం దిశగా నడిపించడానికి ఒక వ్యక్తి.. కాదు కాదు ఒక శక్తి కావాలి. అయితే… బాబు & కో అది వద్దంటున్నారు!
అవును… పార్టీ మృత్యువడిలోకి చేరినా పర్లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పార్టీ విషయాల్లో, పెద్దాయన వ్యవహారాల్లో వీలైనంత తక్కువగా కల్పించుకుంటే బాగుంటుంది.. ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటే సరిపోతుంది అన్నాలోచన చేస్తున్నట్లున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే గతంలో బాలయ్య చిన్నల్లుడు మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమ పార్టీకి లేదని అన్నారు. అవి అపరిపక్వ మాటలు అని కొందరంటే.. అజ్ఞానంతో కూడిన మాటలు అని ఇంకొందరు.. జూ.ఎన్టీఆర్ వస్తే వీరు ఆటలో అరటిపండ్లు అయిపోతారనే భయంతో కూడిన మాటలు అని మరికొందరు అభిప్రాయపడిన సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా మరోసారి బుడ్డోడిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంట టీడీపీ నేతలు!
వివరాళ్లోకి వెళ్తే… నెల్లూరు జిల్లా కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన విషయంపై.. అటు టీడీపీ నేతలు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీలైనంత తొందరగా విగ్రహాన్ని మరోచోట పునఃప్రతిష్టించాలని స్థానిక ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఈ క్రమంలో మొదట్లో ఈ విగ్రహ ప్రతిష్టకు లక్ష్మీపార్వతిని ఆహ్వానించాలని భావించారు. అయితే… స్థానిక ఎమ్మెల్యేకు బాలయ్య ఫోన్ చేయడం, విగ్రహం గురించి మాట్లాడిన అనంతరం ఆ ఆలోచన విరమించుకున్నారని అంటున్నారు! ఇందులో భాగంగా జూ. ఎన్టీఆర్ కి కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్టించే స్థలాన్ని చూపించడంతోపాటు.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిలవాలని భావిస్తున్నారంట స్థానిక నేతలు!
దీంతో.. పెద్దాయన వారసుడిగా జూ. ఎన్టీఆర్ నెల్లూరుకు ఆగస్టు 1న బయలుదేరాలని ఫిక్సయ్యారంట! ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ… జూ. ఎన్టీఆర్ నెల్లూరు వెళ్లడాన్ని కొందరు టీడీపీ సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారని అంటున్నారు. జూ. ఎన్టీఆర్ నెల్లూరులోని కావలికి వస్తే… లక్షల సంఖ్యలో అభిమానులు పోగవుతారని.. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని అంటున్నారంట. పైకి చెబుతున్న మాటలు అవైనా.. లోపల భయాలు, స్వార్ధాలూ వేరే ఉన్నాయంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… కరోనా పేరు చెప్పి బుడ్డోడిని ఆపేస్తున్నారా.. తొక్కేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారంట జూనియర్ అభిమానులు!!
ఎవరికీ పెద్దగా తెలియకుండా.. అలా చుట్టం చూపుగా వచ్చి, స్థలాన్ని పరిశీలించి.. అనంతరం అభిమానులకు ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారానో, మీడియా ద్వారానో తెలియజేసినా సరిపోతుంది. అభిమానులు అది అర్ధం చేసుకుంటారు.. కరోనా సమయంలో సర్ధుకుంటారు. ఈ విషయాలు మరిచిన కొందరు టీడీపీ పెద్దలు… ఈ విషయంలో జూ. ఎన్టీఆర్ ని కరోనా పేరు చెప్పి ఆపేస్తున్నారని అంటున్నారు. విశాఖ వెళ్తానని చెప్పి, జగన్ ప్రభుత్వం దగ్గర పాస్ తీసుకుని.. అమరావతిలో మహానాడు నిర్వహించుకోవడానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా.. ఏపీలో ఎంటర్ అయినప్పుడు జరిగిన కరోనా వ్యాప్తి కంటే ఎక్కువగా.. నెల్లూరు కు జూనియర్ వస్తే జరగకుండా చూసుకుంటామని అభిమానులు చెప్పినా కూడా బాలయ్య & బాబు వినడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి!!