రాజకీయం అంతా సినిమా పదాల చుట్టూ, సినిమా రంగం చుట్టూ పరిభ్రమిస్తోంది.చక్కర్లు కొడుతోంది.రాజకీయం అంతా రంగులు మార్చి మార్చి కొత్త ప్రపంచం సృష్టికి తాపత్రయపడుతోంది.నిర్మాత మరియు మంత్రి అయిన కొడాలి నాని నిన్నటి వేళ పొలిటికల్ మెగాస్టార్ జగన్ అని కితాబిచ్చారు.ఆయన జీవితంలో భయం అనే పదానికి తావే లేదని కూడా అన్నారు.సోనియా లాంటి అధినేత్రిని ఎదుర్కొన్న ధీశాలి అని పొగిడారు.అంతా బాగుంది ఈ యుద్ధంలో గెలుపునకు దారేది? అయినా ఓ సినిమా కోసం ఇంతగా పట్టుబట్టి,పగబట్టి రాజకీయం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి?
నో డౌట్..ఈ వివాదం కొద్ది రోజుల్లో ఆగిపోతుంది.అవును!సినిమా విడుదలై నాలుగైదు వారాలు అయిపోయాక ఈ వివాదం చల్లారిపోతుంది.ఎందుకింత పట్టుబడుతున్నారంటే పవన్ పై జగన్ తన మాట నెగ్గించుకోవాలన్న తాపత్రయం తప్ప మరొకటి లేదు.ఓ సినిమాను ఓటీటీకి ఇచ్చేశాక ఇంకేం తగువులూ ఉండవు అని సాక్షాత్తూ మంత్రి వర్యులే సెలవిస్తున్నారు.అవును! పవన్ నటించిన భీమ్లా నాయక్ అన్నది బాహుబలి సినిమా లాంటి సినిమా కాదు.ఆ మాటకు వస్తే రానున్న ఆచార్య కానీ లేదా సర్కారు వారి పాట కానీ ఏవీ కూడా బాహుబలిలాంటి సినిమాలు కావు.కానీ రాజకీయం దృష్ట్యా ఎవరి ప్రయత్నాన్నో లేదా ఎవరి సంకల్పాన్నో అడ్డుకునే ప్రయత్నాలు అయితే ఏపీ సర్కారు పట్టుబట్టి చేస్తోంది.ఆ విషయంలో పవన్ సినిమాలు దొరికిపోతున్నాయి. మంత్రి మాటలు ప్రకారం చూస్తే..కోపం అంతా పవన్ పై మాత్రమే అని కూడా తేలిపోయింది.ఆ లెక్కన చూసుకుంటే నాలుగైదు రోజులు ఆగితే జీఓ వస్తుంది.ఆ తరువాత సినిమాలు అన్నీ సేఫ్.ఈ ఒక్క సినిమానే నష్టపోవాలి.ఇవే నాని చెబుతున్న మాటలు.
అయ్యో! పవన్ కు పెద్ద ఓటు బ్యాంకు ఏమీ లేదు కదా! ఎందుకని కొడాలి నాని భయపడిపోతున్నారు. పవన్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి ఏం చేయాలనుకుంటున్నారని? ఏం లేదు ఎన్నికల ముందు కొడాలి నాని పడుతున్న జాగ్రత్త ఇది.చంద్రబాబును తిట్టి, పవన్ ను తిట్టి జగన్ దగ్గర పొందాలనుకుంటున్న మెప్పు ఇది. అవును! బాలయ్య కు చేసిన సాయం, బన్నీకి చేసిన సాయం పవన్ కు ఎందుకు చేయరు.. ఓహో! వీళ్లెవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కదా! ఆ విధంగా వాళ్లంతా పొలిటికల్ మెగాస్టార్ ని దాటి ఏ మాట అనలేరు. పవన్ ఒక్కడే అనగలడు కనుక ఆయనొక్కడే విలన్.. మిగతా వాళ్లంతా హీరోలు.
ఓ బాధ్యత ఉన్న మంత్రి అదే పనిగా విపక్ష పార్టీ నేతను తిడుతుంటే ఇండస్ట్రీ ఎలానూ మీడియా ఎదుట స్పందించడం లేదు సరికదా కనీసం ఓ మోస్తరుగా అయినా ప్రకాశ్ రాజ్ చెప్పిన విధంగా అయినా ట్విటర్ వేదికగా మాట్లాడవచ్చు కదా! ఆ పని చేసేందుకు కూడా వీళ్లెవ్వరికీ మనసొప్పడం లేదు.అంటే వీళ్లంతా సేఫ్ గా ఉండి, ఇంకెవ్వరు ఏమయిపోయినా పర్లేదు. అవును! అప్పుడు ఆయన పొలిటికల్ మెగాస్టార్ కాక ఇంకేం అవుతారని? కనుక ఆయనే రియల్ హీరో.. ఇంత మందిని నియంత్రించడం సాధ్యమా మరో ముఖ్యమంత్రికి అయితే! అవును! చంద్రబాబుకు కానీ అంతకుముందు వైఎస్ కు కానీ ఇండస్ట్రీని అదుపులో పెట్టడం చేతగాలేదు.ఒక్క జగన్ కు మాత్రమే సాధ్యం అయింది కనుక నాని దృష్టిలో పొలిటికల్ మెగాస్టార్ అతనే! నో డౌట్ ఇన్ ఇట్.