ప్రకాశం: టిడిపి అధినేత నారా చంద్రబాబు చవకబారు రాజకీయాలు అందరికీ తెలుసని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వటానికి మీరు వ్యతిరేకమా..? అని ప్రశ్నించారు. పేదలకు భూములు ఇవ్వవద్దని చట్టం తెస్తారా..? అని చంద్రబాబును నిలదీశారు మంత్రి ఆదిమూలపు. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన చేశారని.. మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమీ చేయలేరని అన్నారు.
సీఆర్దీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు ఇస్తున్నామన్నారు. అమరావతిలో కేవలం ధనికులకె ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. పేదలకు మంచి జరుగుతుందనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ అనుమతులు తీసుకుని ముందుకు వెళ్తామన్నరు మంత్రి. చంద్రబాబుకు శవాలపై రాజకీయం చేయటం వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చే ముందు దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రావాలని కోరామన్నారు.
ఆయన పర్యటన సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నామని.. కానీ చంద్రబాబు మా క్యాంప్ ఆఫీస్ దగ్గరకు రాగానే బయటకు వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని అన్నారు. వాళ్ళు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేశారని ఆరోపించారు. రాళ్లు ఎవరు రువ్వారో అందరూ చూశారని అన్నారు మంత్రి. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామన్నారు.