ఏపీ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ శైలి ప్రత్యేకం. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తారో. ఎప్పుడు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటారో ఎవరికీ అంతుచిక్కడంమ లేదు. నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రజలు నిలదీస్తే వారిపై తిట్ల వర్షం కురిపించిన బాలయ్య ఇటీవల హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి కోసం కరోనా నివారణకు 55 లక్షల విలువగల పీపీఏ కిట్లు, మందులు అందజేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు బాలయ్య.
తాజాగా మరో ప్రకటన చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని, ప్రతి పక్ష నేతలపై కక్షసాధింపలు మరీ ఎక్కువయ్యాయని మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ. ఏపీకి రాజధాని లేకున్నా తెలంగాణకు మించి ఆదాయం బాగానే వచ్చిందని ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశానన్నారు. బాలయ్య జగన్ ని ఎందుకు కలవబోతున్నారు? ఆయన జగన్‌ని ఏమని డిమాండ్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
బాలయ్యకు వైఎస్ జగన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. `సమరసింహారెడ్డి` చిత్రానికి వైఎస్ జగన్ భారీగా బ్యానర్లు కట్టించి తన వర్గం చేత హంగామా చేయించారట. ఇంతటి అభిమాన హీరో తన అపాయింట్‌మెంట్ కోరితే వైఎస్ జగన్ కాదంటారా? ఒక వేళ అవునంటే వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరగనుంది. ముందు ముఖ్యమంత్రి హోదాలో వున్న వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు? ఓ అభిమానిగా బాలయ్యతో మాట్లాడతారా? లేక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారా? అన్నది టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వై.ఎస్. జగన్‌ని బాలయ్య కలుస్తున్నది కొత్త జిల్లాల్లో తన నియోజక వర్గమైన హిందూపూర్ ని కూడా చేర్చమని చెప్పడానికా అని సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి.