‘ మూడు ‘ జపం వెనుక మోదీ ? అయ్యబాబోయ్ జగన్ ఇదేం ట్విస్ట్ ?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మూడు రాజధానుల జపం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన , ఏపీ బీజేపీ ఇలా అందరూ జగన్ నిర్ణయంను తప్పు పడుతూ భగ్గుమన్నారు.  అమరావతి నుంచి రాజధాని ఏ విధంగా తరలిస్తారు అంటూ పెద్ద రాద్దాంతం చేయడంతో పాటు, ప్రజా ఉద్యమాలను నడిపించారు. ఎవరు ఎన్ని చేసినా, జగన్ మాత్రం తాను ప్రతిపాదించిన అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని నిర్ణయానికి కట్టుబడే ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కోర్టు కేసులు, ప్రతిపక్షాల రాద్దంతాలు, ఇలా అన్నిటినీ ఎదుర్కొంటూ, తాను ప్రతిపాదించిన మూడు రాజధాని విషయంలో ముందుకు వెళ్తున్నారు.
ఇక ఏపీ బిజెపి నాయకులు ఈ విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆందోళన నిర్వహించినా బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి మద్దతుగా ఎంపీ సుజనాచౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు గట్టిగానే పోరాటం చేసి, అమరావతి నుంచి రాజధాని జగన్ తరలించ లేరు అని, తాము హామీ ఇస్తున్నాము అంటూ గట్టిగానే చెప్పడంతోపాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ ఉద్యమంలో  హడావుడి చేశారు. అయినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు సరి కదా, మరి కాస్త దూకుడు పెంచడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. అసలు ఏ ధైర్యంతో జగన్ ఈ విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు అనేది అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
కానీ అసలు ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చింది కేంద్ర బీజేపీ పెద్దలని, వారి నిర్ణయంతోనే జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చి, అమరావతిని రాజధానిగా ఒప్పుకోకపోవడానికి  కారణం అని, ఇప్పుడిప్పుడే వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే సమయం వచ్చినప్పుడల్లా బిజెపి అగ్రనాయకులు మూడు రాజధానులు అంశంలో తాము జోక్యం చేసుకోమని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని చెబుతూ వచ్చేవారు. అంతేకాకుండా జగన్ నిర్ణయానికి బహిరంగంగానే మద్దతు తెలుపుతూ రావడంతో, ఏపీ బీజేపీ నేతలకు ఈ పరిణామాలు అర్థమయ్యేవి కావు. ఇక ఆ తరువాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజును ఆ పదవిలో కూర్చోబెట్టడం, అమరావతి వ్యవహారంలో కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఒకరిద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంటి పరిణామాలతో సుజనాచౌదరి వంటివారు పూర్తిగా అమరావతి నినాదాన్ని వదిలేసి సైలెంట్ అయిపోయారు.
ఇక కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల విషయంలో కేంద్రం అభిప్రాయం ఏంటో తెలపాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో తాజాగా కేంద్ర హోంశాఖ స్పందించి మూడు రాజధానులు ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నామని, ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఎక్కడా లేదని, ఇలా అనేక అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంతో జగన్ వెనుక బీజేపీ అగ్రనేతలు ఉన్నారని అందరికీ అర్థమైపోయింది.
గత టీడీపీ ప్రభుత్వం లో అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని,, ఇప్పుడు కూడా అమరావతి రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబు మరింతగా బలపడి పోతాడని, అప్పుడు గాని ఏపీలో బీజేపీ బలపడే ఛాన్స్ లేదని ఇలా ఎన్నో సమీకరణాలు లెక్కలు వేసుకున్న బిజెపి అగ్రనేతలు మూడు రాజధానులు ప్రతిపాదనను జగన్ ముందు పెట్టి వెనకుండి ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ధైర్యంతోనే జగన్ ఇంత దూకుడుగా వెళ్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
-Surya