బాబు పిలుపు.. స్పందించ‌ని నేతలు.. ఏంటీ అవ‌మానం

-

గ‌త‌మెంతో ఘ‌న కీర్తి ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. వ‌ర్త‌మానంపై ఉండే ప‌ట్టు .. భ‌విష్య‌త్తును నిర్దేశిస్తుంద‌ని అంటారు ప‌రిశీల‌కులు. అది రాజ‌కీయాలైనా.. మ‌రేదైనా.. స‌రే.. ప్ర‌స్తుతం ఏంటి? అనేదే ముఖ్యం. టీడీపీ విష‌యా నికి వ‌స్తే.. గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తి ఉంద‌ని చెప్పుకొంటున్నారు. నిజ‌మే. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. మూడు సార్లు ముఖ్య‌మంత్రి, మ‌రెన్నోసార్లు విపక్ష నేత‌. కేంద్రంలో సైతం చ‌క్రం తిప్పిన కీర్తి! ఇవ‌న్నీ.. చంద్ర‌బాబుకు సొంతం. మంచిదే. గ‌తం బాగానేఉంది. మ‌రి ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు టీడీపీలో ప్ర‌శ్న‌గా మారింది.

గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కుదేలైన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఊదాల‌ని నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పార్టీ పుంజుకుంటుంద‌ని, ఊపు వ‌స్తుంద‌ని అనుకున్నారు. దీనిని పార్టీలోని సీనియ‌ర్లుసైతం స్వాగ‌తించారు. పార్టీలో పున‌రు త్తేజం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ, ఆ దాఖ‌లా ఎక్క‌డా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు మాన‌స పుత్రిక‌గా స్వ‌యంగా పేర్కొన్న రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో నాయ‌కులు సైలెంట్ అయ్యారు.

అమ‌రావ‌తిని త‌ర‌లించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయ వివాదాల‌తో నిలిచిపోయిపోక ఉండ‌క‌పోతే.. ఇప్ప‌టికే రాజ‌ధాని ఎప్పుడో త‌ర‌లిపోయేది. స‌రే! ఇప్పుడు మూడు రాజ‌ధానులు వ‌ద్దంటూ.. ఇక్క‌డి రైతులు, మ‌హిళ‌లు చేస్తున్న ఉద్య‌మానికి నేటితో 300 రోజులు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో వారు ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఈ ఉద్య‌మానికి క‌ర్త క‌ర్మ క్రియ చంద్ర‌బాబే క‌నుక ఆయ‌న కూడా వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌మ్ముళ్ల‌కు పిలుపు నిచ్చారు. రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా ఉద్య‌మించండి.. ప్ర‌భుత్వాన్ని ఏకేయండి.. జ‌గ‌న్‌ను తూర్పార బ‌ట్టండి అని పేర్కొన్నారు.

ఆయ‌న అలా పిలుపు ఇవ్వ‌డం త‌ప్పులేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే చాలా మందికి ప‌ద‌వులు ఇచ్చారు క‌నుక త‌న మాట‌ను గౌర‌విస్తార‌ని, అధ్య‌క్షుడి పిలుపు మేర‌కు రోడ్ల మీద‌కు వ‌స్తార‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా టీడీపీలో చంద్రబాబు మాట‌ను ఒక్క గుంటూరు, కృష్ణాజిల్లాల‌ నేత‌లు మిన‌హా ఎవ‌రూ ప‌ట్టించుకోక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజ‌మే! ఇటీవ‌ల త‌మ్ముళ్ల‌కు ప‌ద‌వులు ఇచ్చి.. అసంతృప్తుల‌ను త‌గ్గించినా.. ఇప్పుడు రాజ‌ధాని విష‌యంపై పిలుపు ఇస్తే.. ఎందుకు ప‌ట్టించుకోలేదు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. దీనిపై బాబు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news