తిరుమల కొండలపై మళ్లీ విమానం కలకలం రేపింది. తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపంలో మళ్లీ విమానాలు ఎగరడం కలకలం రేపింది. అవి ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. నెలరోజుల సమయంలో మూడుసార్లు విమానాలు ఇలా ఆలయానికి సమీపం నుంచి వెళ్లడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. గురువారం రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్లమంటపానికి మధ్యలో నుంచి, మరొకటి ఆలయ సమీపంగా వెళ్లాయి. విమానాలు తిరగడంపై గతంలోనే పలుమార్లు టీటీడీ అధికారులు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన స్పందన రాలేదు.