గుంటూరు వైసీపీలో మ‌రో ర‌చ్చ‌… టీడీపీతో కీల‌క నేత మిలాఖ‌త్‌…!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఆయుప‌ట్టు వంటి జిల్లా గుంటూరులో పాగా వేశామ‌న్న ఆనందం అధికార వైసీపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ భారీ స్థాయిలో పార్టీ విజ‌యం సాధించినా.. అడుగ‌డుగునా.. ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు మ‌ధ్య వివాదాలు రాజుకుంటూనే ఉంటున్నాయి. ఒక‌టి వ‌దిలితే ఒక‌టి ఇక్క‌డ పార్టీకి పెను స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. తాజాగా వైసీపీ స‌ర్కారు జిల్లాల ఏర్పాటును తెర‌మీదికి తెచ్చిన త‌ర్వాత‌… గుంటూరు వైసీపీలో ఈ అంశం ప్ర‌ధానంగా పార్టీ నేత‌ల మ‌ధ్య వివాదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఈ క్ర‌మం లోనే గుర‌జాల జిల్లా ఏర్పాటు కావాలనే డిమాండ్ తెర‌మీద‌కి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విష‌యంలోకి వెళ్తే.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతో తన నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలకు పొస‌గ‌డం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసిసాగే పరిస్థితి లేదు. పల్నాడు ప్రాంతంగా నరసరావుపేట కొత్త జిల్లా ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేల మాటలకే పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో న‌ర‌సా‌రావు పేట కేంద్రంగా ప‌ల్నాడు ఏర్పాటుకు చ‌క‌చ‌కా అడుగులు ప‌డుతున్నాయి. అయితే.. త‌న మాట విన‌ని నేతల‌కు ఈ విష‌యంలో చెక్ పెట్టాల‌ని అనుకున్నారో ఏమో.. ఎంపీ లావు అనూహ్యంగా నరసరావుపేట కాకుండా గురజాలను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ తెరపైకి తెచ్చారు.

వాస్త‌వానికి గుర‌జాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల‌నేది టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు డిమాండ్‌. దీనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే.. టీడీపీ ఓటు బ్యాంకు మ‌రింత ప‌దిలం అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులుగా ఆయ‌న రోడ్డెక్కారు. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కానీ, దీనిని వైసీపీ నాయ‌కులు స్థానిక ఎమ్మెల్యే కూడా వ్య‌తిరేకించారు.

కానీ, ఇంత‌లోనే వైసీపీ నేత‌లు.. గుర‌జాల కేంద్రం జిల్లా ఏర్పాటు చేయాలంటూ.. ప్ర‌తిపాద‌న‌ను తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా ఎంపీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని, త‌న మాట విన‌ని వారిని లైన్‌లోకి తీసుకొచ్చునే వ్యూహంలో భాగంగానే ఆయ‌న ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇది మున్ముందు ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.