పవన్ దసరా నిర్ణయం సంచలనమేనా ?

రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులకు గురవుతూ, ఎన్నో ఇబ్బందికర పరిణామాలను, అవమానాలను ఎదుర్కొంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సొంతంగా పార్టీ పెట్టినా, ఆ పార్టీని ముందుకు నడిపించే క్రమంలో ఆయన తప్పటడుగులు వేస్తున్నారని, సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరని, ఒకవేళ తీసుకున్నా, దానికి కట్టుబడి చివరి వరకు పోరాటం చేయరని, ఇలా ఎన్నో రకాల అవమానాలను ఆయన ఎదుర్కుంటూ వస్తున్నారు. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడాలంటే, కార్యకర్తలు భరోసా కల్పించాలంటే, ఖచ్చితంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి అండదండలు ఉండాలనే అభిప్రాయంతో పవన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

pawan-kalyan
pawan-kalyan

కానీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఆ పార్టీ జనసేనను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడం , కనీసం కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలా ఎన్నో పరిణామాలతో పవన్ మరెన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక పార్టీ కార్యకర్తల్లోనూ, నిరాశా నిస్పృహలు తీవ్రంగా అలుముకున్నాయి. కొద్ది రోజుల క్రితం అంతేర్వేది వ్యవహారంతో పార్టీలో కాస్త కదలిక వచ్చినట్టు కనిపించినా, ఆ క్రెడిట్ మొత్తం బీజేపీకే వెళ్లిపోయిందనేది జనసైనికుల అభిప్రాయం. ఇక కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి పవన్ హైదరాబాదులోని ఇంటికే పరిమితమయ్యారు.

ఏపీకి వచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. 70ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి ఒకటి రెండు సార్లు వచ్చి, అన్ని కార్యక్రమాలను చక్కబెట్టుకుని పార్టీ నేతల్లో ఉత్సాహం నింపి, తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. కానీ పవన్ ఆ విధంగానూ వ్యవహరించకపోవడంతో పార్టీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో దసరా పండుగ నుంచి బిజెపి జనసేన కలిసి సంయుక్తంగా సరికొత్త కార్యక్రమాలను రూపొందించుకుని , ప్రజా పోరాటాలు చేస్తూ, ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా, ముఖ్యమైన కార్యక్రమాలలో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతోపాటు, వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఈ దసరా నిర్ణయం ఆయనకు ఏ మేరకు క్రెడిట్ తీసుకు వస్తుందో ?

-Surya