క్రేజ్ లేకపోయినా పవన్ కు మోజు తగ్గలేదు గా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వడి వడిగా ఏపీ రాజకీయాల్లో పట్టు సంపాదించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బీజేపీ అండతోనే రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ, క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే విషయం పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఏపీలో చోటు చేసుకుంటున్న ఏ పరిణామాలను వదిలిపెట్టకుండా, తనకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నారు. అంతర్వేది ఘటన తో పార్టీకి బాగా ఆదరణ పెరిగింది అనే విషయం పవన్ గ్రహించారు. అందుకే ఇక తాను ఏపీలో అడుగు పెట్టి, ఏపీ రాజకీయాలను మరింత వేడి ఎక్కించాలి అని చూస్తున్నారు. ఇప్పటికి తన రాజకీయ ప్రత్యర్థులు తాను హైదరాబాద్ పరిమితమైపోయా అని, ఏపీ రాజకీయాలు పట్టించుకోవడంలేదని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు బీజేపీతో కలిసి చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే పవన్ వైజాగ్ పైకి ఎక్కువ ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ను పరిపాలనా రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో, అక్కడ వైసిపి బలం బాగా పెరిగిందని పవన్ అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు తమ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉండడంతో, విశాఖ కేంద్రంగా రాజకీయం ముందుకు నడిపించాలని పవన్ సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖలోని గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని విశాఖ నుంచి ప్రారంభించడం పవన్ కు అలవాటు గా వస్తోంది. కానీ విశాఖలో పవన్ కు చేదు అనుభవం ఎదురవడం, ఘోరంగా ఓటమి చెందడంతో చాలా కాలంగా విశాఖ వైపు కన్నెత్తి చూసేందుకు పవన్ ఇష్టపడటం లేదు.
అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ వ్యతిరేకిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన ఆయన విశాఖ కేంద్రంగా మళ్లీ యాక్టివ్ అవ్వాలి అని చూస్తున్నారు. అయితే పవన్ కు అక్కడ ఆదరణ లేదనే విషయం మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైపోయింది. పవన్ సామాజికవర్గం జనాలు ఎక్కువగా ఉండడం, అభిమానులకు కొదవే లేకపోవడం, తప్పకుండా అక్కడి నుంచి విజయం సాధిస్తా అని పవన్ బలంగా నమ్మినా, అక్కడ ఫలితాలు రివర్స్ లో వచ్చాయి. అక్కడ పవన్ ఓటమి చెందడంతో, ఆయనకు క్రేజ్ లేదనే విషయం బయట పడింది.అయినా మళ్లీ అక్కడి నుంచే యాక్టివ్ అవ్వాలని పవన్ చూస్తున్నారు.
అవసరమైతే 2024 ఎన్నికల్లో మళ్ళీ విశాఖ నుంచి బరిలోకి దిగాలని పవన్ అభిప్రాయపడుతున్నారు. తన అభిరుచులకు, ఆలోచనలతో ఉత్తరాంధ్ర ప్రాంతం అయితేనే బాగుంటుంది అనే సెంటిమెంట్ పవన్ లో ఉండడంతో, విశాఖ రాజకీయ వేదికగా ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది.అయితే విశాఖలో యాక్తివ్ అయినా, మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ వ్యతిరేకిస్తుండడంతో ఆయనకు అంతగా సానుకూలత ఉండదేమో అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ప్రజలు రాజధాని విషయంలో పెద్దగా ఆసక్తి గా లేరనే విషయం పవన్ కు వివిధ నివేదికల రూపంలో అందడంతో, మళ్ళీ విశాఖ నుంచి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, బలం పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఎప్పటికైనా విశాఖ జనాలు తను ఆదరిస్తారని నమ్మకం పవన్ లో బలంగా ఉంది.
-Surya