ఇంకా మంత్రులుగానే బోస్‌, మోపిదేవి.. ఎన్నాళ్లో తెలుసా..?

-

చిత్ర‌మైన ఘ‌ట‌న ఒక‌టి ఏపీ ప్ర‌భుత్వంలో చోటు చేసుకుంది. మంత్రులుగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌ర్వాత కూడా పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మణారావులు ఇద్ద‌రూ తాజాగా జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో జిల్లా ఏర్పాటుపై ప్ర‌త్యేకంగా జ‌రిగిన ఏపీ కేబినెట్ మీటింగ్‌కు ఆ ఇద్ద‌రూ హాజ‌రుకావ‌డంతో మీడియాలోను, ఇటు రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు దారితీసింది. వారిద్ద‌రూ ఇటీవ‌లే క‌దా.. రాజీనామా చేశారు? మ‌రి ఇప్పుడు ఎలా హాజ‌ర‌య్యారు? అస‌లు ఇలా హాజ‌రు కావ‌చ్చా?  లేక ఏదైనా పొర‌పాటు జ‌రిగిందా? అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రినీ తొలిచేస్తోంది. దీంతో ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

నిజ‌మే.. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌.. సంక్షేమ శాఖను చూస్తున్న మోపిదేవి వెంక‌ట ర‌మణారావులు ఇద్ద‌రూకూడా గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే, వీరిలో బోస్ అప్ప‌టికే ఎమ్మెల్సీగా ఉండ‌డం, పార్టీలో సీనియ‌ర్ కావ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌ను త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇక‌, మోపిదేవి కూడా జ‌గ‌న్‌కు అత్యంత అనుకూల వ్య‌క్తి కావ‌డం, సీనియ‌ర్ కావ‌డం, గ‌తంలో మంత్రి ప‌ద‌విని నిర్వ‌హించిన అనుభ‌వం ఉండ‌డంతో ఆయ‌నను కూడా ఎమ్మెల్సీని చేసి .. మంత్రిగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మండ‌లి ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో అసెంబ్లీలో తీర్మానం చేసి మ‌రీ.. కేంద్రానికి పంపారు. ఈ క్ర‌మంలో బోసు, మోపిదేవిల ప‌రిస్థితిపై గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. మండ‌లి ర‌ద్ద‌యితే.. వీరి మంత్రి ప‌ద‌వులు పోతాయి. అంతేకాదు, వీరు మండ‌లి స‌భ్యులుగా కూడా ఉండ‌రు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ వీరిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఈ నేప‌థ్యంలోనే వారం కిందటే ఈ ఇద్ద‌రూ త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు, మంత్రి ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశారు. దీంతో వారికి రాష్ట్ర కేబినెట్‌కు మ‌ధ్య ఎలాంటి సంబంధం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు తాజాగా జ‌రిగిన రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో ఇద్ద‌రు మంత్రులు ద‌ర్శ‌న‌మివ్వ‌డంపై ప్ర‌తి ఒక్క‌రూ చెవులు కొరుక్కున్నారు.

ఇలా కూడా సాధ్య‌మ‌వుతుందా? అని చ‌ర్చించుకున్నారు. ఇది సాధ్య‌మేన‌ని అంటున్నారు సీనియ‌ర్ అధికారులు. ఎందుకంటే. వారిద్ద‌రూ త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు అయితే చేశారు. కానీ, ఇవి ఇంకా అధికారికంగా దృవీక‌రించ‌లేదు. సీఎం జ‌గ‌న్ వీటిపై సంత‌కం చేస్తే.. వాటిని గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంపితే.. అధికారికంగా వారిద్ద‌రూ మంత్రి ప‌ద‌వుల నుంచి త‌ప్పుకొన్న‌ట్టు సో.. అప్ప‌టి వ‌ర‌కు వారు మంత్రులేన‌న్న‌మాట‌!!

Read more RELATED
Recommended to you

Latest news