అధికార వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు ఎవరి దారిలో వారు నడుస్తున్నారా? ఎవరికి తోచినట్టు వారు ఉంటున్నారా? అంటే .. తాజాగా వెలుగు చూసిన కొన్ని ఘటనలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్ని జిల్లాల్లో అసంతృప్తితో ఎంపీలు రగిలిపోతున్నారు. మరికొన్ని చోట్ల పార్టీని ధిక్కరించే పనులు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల తమ పనులు తాము చేసుకుంటూ.. ప్రజల పనులు చేయడం మరిచిపోయారనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి నియోజకవర్గమే కృష్ణాజిల్లా మచిలీపట్నం అంటున్నా రు పరిశీలకులు. ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి విజయం సాదించారు. వివాద రహి తుడు, పార్టీకి, జగన్‌కు కూడా నమ్మిన బంటుగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఎంత పార్టీకి నమ్మిన బంటైనా.. జగన్‌కు ఎంత ఆత్మీయుడైనా.. ఒక నియోజకవర్గంలో గెలిచిన తర్వాత.. ఆ నియజకవర్గాన్ని ఆయన పట్టించుకోవాలి కదా? అక్కడి ప్రజల సమస్యలను ఆయన పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన నియోజకవర్గం ప్రజలకు అంతో ఇంతో సాయం చేసేందుకు ముందుకు రావాలి. మరీ ముఖ్యంగా మచిలీపట్నంలో మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ యాభై శాతం మంది ప్రజలకు సముద్రమే ఆధారం. అయితే, కరోనా ఎఫెక్ట్ సహా.. తుఫానుల కారణంగా వారి ఉపాధి దెబ్బతింది. ఈ క్రమంలో చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎంపీగారు వస్తారు. సమస్యలు తగ్గిస్తారు.. అని ఎదురు చూస్తున్నారు.
కానీ, ఎంపీ బాలశౌరి మాత్రం తన పనుల్లో తాను బిజీ అయ్యారు. తనకు సొంతగా ఎలాంటి వ్యాపారాలు లేక పోయినా.. సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఢిల్లీలో కీలకంగా ఆయన చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అక్కడే మకాం వేశారు. నియోజకవర్గంలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకునేందుకు ఆయన సమయం వెచ్చించలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఇక్కడి ప్రజలు.. అయ్యా.. ఎంపీగారు.. రాష్ట్రం కోసం మీ సేవలు మంచివే అయినా.. మీకు ఓట్లేసిన మమ్మల్ని కూడా పట్టించుకోండి! అంటూ నినాదాలు చేస్తున్నారు.
అయినప్పటికీ.. ఎంపీగారు ఎక్కడా వీరికి దర్శనం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి ప్రజలు రేపు మాపో.. ధర్నాలకు, నిరసనలకు రెడీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కొసమెరుపు ఏంటంటే.. అన్ని చోట్లా ఎంపీలకు అంతో ఇంతో సెగ ఉంటే.. బాలశౌరికి మాత్రం ఎక్కడా అలాంటి పరిస్థితి లేకపోగా.. పార్టీలోనూ.. విపక్ష నేతల్లోనూ ఆయనపై పాజిటివ్ దృక్ఫథం ఉండడం గమనార్హం.