సీబీఐపై సాక్షి దినపత్రిక విష ప్రచారం చేస్తుందని ఎంపీ రఘురామ ఫైర్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన సీబీఐపై ప్రజల్లో విషం నింపే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక చేస్తోందని, అవినాష్ రెడ్డి గారు లక్ష్యంగా దర్యాప్తు అనే వార్త కథనంలో ఐపిడిఆర్ పేరిట కోర్టును సీబీఐ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
సీబీఐకి నైపుణ్యం లేదంటున్న సాక్షి దినపత్రిక, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సీఐడీకి మాత్రమే నైపుణ్యం ఉందా? అని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో సీబీఐ చిలకలా మారిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీబీఐ చంద్రబాబు చేతిలో చిలకలా మారితే జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు ఆయన ఎందుకు ప్రయత్నించలేదని అన్నారు. గత నాలుగేళ్లుగా ఆర్థిక నేరాభియోగ కేసులను కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపును పొందుతున్నప్పటికీ ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని, అంటే సీబీఐ చంద్రబాబు గారి చేతిలో చిలకలా మారిందనడం శుద్ధ అబద్ధమని తేటతెల్లమవుతుందన్నారు.