టీడీపీలో పెను సంక్షోభం… పార్టీని వీడ‌నున్న కీల‌క నేత‌లు…!

ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి అస‌లె పెనం మీద నుంచి పొయ్యి మీద ప‌డేలా ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయాక న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌గా తాజాగా ఏర్పాటు చేసిన పార్టీ జంబో క‌మిటీ దెబ్బ‌తో పాత సీనియ‌ర్లు, ప‌ద‌వులు రానివారు పార్టీకి వ‌రుస పెట్టి గుడ్ బై చెప్పేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీకి మాజీ మంత్రి తాళ్లపాక రమేశ్ రెడ్డి, ఆయన భార్య అనురాధ రాజీనామా చేశారు.

 

ర‌మేశ్‌రెడ్డి గ‌తంలో నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతో పాటు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌లుసార్లు వాడుకుని టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజా క‌మిటీ ఏర్పాటులో త‌మ‌కు మాట కూడా చెప్ప‌కుండానే అనూరాధ‌ను రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించడంపై ఈ దంప‌తులు ఇద్ద‌రు మ‌న‌స్థాపం చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి ర‌మేశ్‌రెడ్డి దంప‌తులు ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు.

చిన్న మాట కూడా చెప్ప‌కుండానే అనూరాధ‌ను పార్టీ నుంచి త‌ప్పించ‌డంతోనే ర‌మేశ్‌రెడ్డి దంపతులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని ఆ దంప‌తులు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మ‌రో కీల‌క నేత … ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యనారాయణ సీతారామస్వామి (సోంబాబు) పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనమైంది. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని ఏకంగా చంద్ర‌బాబుకే పంపారు.

సోంబాబు 18 ఏళ్ల పాటు టీడీపీలో వివిధ ప‌ద‌వుల్లో ఉన్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వాపోయారు. గత ఎన్నికల్లో ఉంగటూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని… చంద్ర‌బాబు స‌భ్య‌త్వాల పేరుతో రు. 100 కోట్లు వ‌సూలు చేసి… స‌భ్య‌త్వం క‌లిగిన కార్య‌క‌ర్త చ‌నిపోతే క‌నీసం ఇన్సూరెన్స్ ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని బాంబు పేల్చారు. ఇక ఇదే బాట‌లో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు కీల‌క నేత‌లు ఉన్నారు.