ఒక్క జిల్లాకు ముగ్గురు అధ్యక్షులు..టీడీపీ స్ట్రాటజీ వర్కవుటయ్యేనా…?

-

ఒకప్పుడు ఆ జిల్లా టీడీపీకి ఆయువుపట్టు.కానీ మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్సయింది.జిల్లాలో ఉద్దండులైనా నాయకులున్నా కేడర్ తలోదిక్కుకు వెళ్లిపోయింది. సీనియర్లు పార్టీని కాపడలేక కాడి కింద పడేసిన వేళ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు. దీంతో ఏకంగా జిల్లాలో ముగ్గురు అద్యక్షులు పార్టీని నడిపించబోతున్నారు. ఈ సారథులు భారాన్ని తగ్గిస్తారా? కొత్త తలనొప్పులు తెస్తారా? అన్నది ఇప్పుడు జిల్లా తెలుగు తమ్ముళ్లలో హాట్ టాపిక్ గా మారింది.


తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి ఉద్దండులైన నాయకులు ఉన్నారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, ఆరోసారి ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇలా పలువురు సీనియర్లు జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇంత మంది సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నా పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని ఆలోచించారు చంద్రబాబు.

పార్లమెంటరీ అధ్యక్షులుగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలకు సామాజిక సమతూకం పాటించారు. కాకినాడలో కాపు సామాజికవర్గ కోటాలో జడ్పీ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కుమార్‌, రాజమండ్రిలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి జవహర్‌, అమలాపురంలో బీసీ నేత అయిన రెడ్డి అనంతకుమారిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. పెద్ద జిల్లా, కులాల ఆధిపత్యం, ఒకే పార్టీలో ఉన్నా వర్గపోరాటాలు దండిగా ఉంటాయి. అలాంటి జిల్లాలో ఆచితూచి వ్యవహరించారట చంద్రబాబు. మూడు ప్రధాన కులాలకు మూడు పార్లమెంటరీ జిల్లాలు అప్పగించి సమన్వయం చేశారట. ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గంలో గొడవ వచ్చినా మిగిలిన ప్రాంతాల వారు జోక్యం చేసుకునేలా సెట్‌ చేశారట.

జ్యోతుల నవీన్‌కు పదవి ఇవ్వడం ద్వారా టీడీపీలో యువతకు ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలు పంపారట. గతంలో కొవ్వూరులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన జవహర్‌పై లోకల్‌గా వ్యతిరేకత ఉన్నా.. ఆయన వైపే మొగ్గు చూపించారు చంద్రబాబు. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం భార్య రెడ్డి అనంతకుమారికి అమలాపురం బాధ్యతలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు టీడీపీ అధినేత. గతంలో సర్పంచ్‌గా, ఎంపీపీగా పనిచేశారు అనంతకుమారి. పైగా అమలాపురం లోక్‌సభ పరిధిలో శెట్టిబలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఆ సామాజికవర్గానికి చెందిన అనంతకుమారికి పదవి ఇవ్వడం ద్వారా బీసీ ఓట్లు జారిపోకుండా జాగ్రత్త పడ్డారని అనుకుంటున్నారు. ఇలా ముగ్గురు నేతలపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.

జిల్లాలో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పెద్దన్న పాత్ర పోషిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తను చేశారు. ఇది ఆయనకు పార్టీపరంగా ప్రమోషనే అయినా.. రేపటి రోజున జిల్లాలో పార్టీ వ్యవహారాలను పట్టించుకుంటారా లేదా అన్న చర్చ మొదలైందట. అలాగే ఇప్పుడు జిల్లాకు ముగ్గురు అధ్యక్షులు రావడంతో మరో చర్చ జరుగుతోందట. ఈ ముగ్గురు పార్టీకి బలమవుతారా? లేక తలనొప్పులు తెస్తారా అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news