టీడీపీ రెండు కళ్లు కాదు.. రెండు నాలుకల సిద్ధాంతం ఇది!

రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు.. ఏపీకి వచ్చి అడ్డంగా రాష్ట్రాన్ని విడగొట్టారంటూ దొంగేడుపులు ఏడ్చిన సంగతి తెలిసిందే! సరే అది ముగిసిన అధ్యాయం!! ఈ సమయంలో ఏపీలో హిందుత్వ నినాదాలు పెరిగిపోతున్నాయని – క్రైస్తవ్యం పెరిగిపోతుందని చెబుతున్న టీడీపీ… నాయకులు ఒకమాట – వారి తరుపు మీడియా నుంచి మరోమాట చెప్పిస్తూ.. రెండు నాలుకల సిద్ధాంతాన్ని అమలుపరుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే… రాష్ట్రంలో క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేసి, తద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవడానికి వైకాపా పథకాలు రచిస్తోందని.. అందులో భాగంగానే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు అని చంద్రబాబు తనదైన వాదన తెరపైకి తెస్తున్నారు. ఇందులో లాజిక్ ఏమిటనేది బాబు మస్తిష్కానికే అర్ధం అవ్వాలి అని అంటున్నారు విశ్లేషకులు! ఆ సంగతులు బాబు అలా చెబుతుంటే… బాబు తన అనుకూల మీడియాలో పూర్తి భిన్నమైన వాదనను వండించేస్తున్నారు!

“ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి సహకారంతోనే రాష్ట్రంలో హిందుత్వ ఎజెండాను విస్తరింపజేయాలన్నది బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు” అని తమ అనుకూల మీడియాలో రాయిస్తున్నారు చంద్రబాబు! ఇక్కడ బాబు చెబుతున్న.. రాయిస్తున్న.. రెండు అంశాలనూ పరిశీలిస్తే.. బాబు రెండు నాలుకల సిద్ధాంతం ఇట్టే అర్ధమవుతుంది!

ఒక పక్క జగన్ ఏపీలో హిందుత్వాన్ని దెబ్బతీసి క్రైస్తవ్యాన్ని పెంచాలని చూస్తున్నారని అంటూనే… మరోవైపు బీజేపీకి సహకరిస్తూ రాష్ట్రంలో హిందుత్వాన్ని ఎగదోస్తున్నారని అంటున్నారు! దీంతో… బాబు రెండుకళ్ల సిద్ధాంతం అయిపోయింది.. ఇప్పుడు రెండు నాలుకల సిద్ధాంతం తెరపైకి వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు!!

-CH Raja