రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉన్నా.. ప్రయోజనం ఉండదు. ఓడినా.. ప్రజలకు దూరంగా ఉన్న ప్రయోజనం ఉండదు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు చేరువ కావడమే ప్రస్తుతం రాజకీయ నేతలు నేర్వాల్సిన ప్రధాన పాఠం. కానీ, టీడీపీ భావి అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్.. మాత్రం ఈ పాఠం నేర్చినట్టు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు టీడీపీ సీనియర్లు. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
బీసీ ఓటు బ్యాంకు పదిలంగా తమకే ఉంటుందని, పైగా రాజధానిని ఇక్కడే నిర్మిస్తున్నాం.. కాబట్టి ఆ ప్రభావం కూడా తమకు సానుకూలంగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశించారు. ఈ క్రమంలోనే ఆయన ముందు వెనుకా ఆలోచించకుండా.. లోకేష్‌ను ఇక్కడ రంగంలోకి దింపారు. అయితే, ఆయన దాదాపు 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదు. అప్పుడప్పుడు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వచ్చిన ఆయన కరోనా నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమై.. పిట్ట కబుర్లకే పరిమితమయ్యారు.
అయితే, అవసరం.. అవకాశం.. వచ్చినప్పుడైనా లోకేష్ స్పందించాలి కదా?! ఇక్కడి ప్రజలకు అండగా ఉండాలి కదా? అని సీనియర్ నాయకులు అంటున్నారు. రెండు మూడు రోజుల కిందట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ఇక్కడి రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. రాజధానికి ఈ ప్రాంతం అనువైనది కాదని చెప్పుకొచ్చారు. ఇది అనవసరమని.. ఇక్కడ రైతులకు ఎంతగా చెప్పినా అర్ధం చేసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఈ సమయంలో అయినా.. ఇక్కడ నుంచి పోటి చేసి ఓడిపోయిన నాయకుడిగా లోకేష్ స్పందించి.. ఆళ్ల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారని ఇక్కడి ప్రజలు ఎదురు చూశారు. కానీ, ఆయన మాత్రం హైదరాబాద్‌లో తీరిగ్గా కూర్చొని కదల కుండా ఉన్నారు. ఈ పరిణామాలను చూస్తున్న సీనియర్లు.. ఇలా అయితే.. కష్టమే మా చిన్నబాబుకు! అని కామెంట్లు కుమ్మరిస్తున్నారు. మరికొందరు… మాత్రం అవకాశం వచ్చినప్పుడైనా ప్రజలకు అండగా ఉండాలి కదా! అని సూచిస్తున్నారు. మరి చిన్నబాబు వింటారా? చూడాలి.
-vuyyuru subhash