ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు 175 మందిని ప్రకటించింది. 25 ఎంపీ స్థానాలకు మాత్రం 24 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కొంత మంది అభ్యర్థులను మాత్రం ప్రకటించారు.
జనసేన, బీజేపీ తమ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీడీపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మైలవరం, ఎచ్ఛర్ల అసెంబ్లీ స్థానాలపై సందిగ్దత వీడనున్నట్టు సమాచారం. మొత్తం 25 ఎంపీ స్థానాలకు టీడీపీ 17 సీట్లలో పోటీ చేయనుండగా.. జనసేన రెండు సీట్లలో, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. ఇప్పటికే జనసేన 1 ఎంపీ స్థానాన్ని ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.