ముఖ్యమంత్రి రాజు లాంటివారని.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నం రాజధాని అని, త్వరలోనే తాను కూడా షిఫ్ట్ అవుతానంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొత్తగా చర్చలు పెట్టడం అనవసరం అన్నారు. రాజధానికి కావలసిన అన్ని మౌలిక సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని, పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్ తో పాటు పారిశ్రామిక కారిడార్లలో 50 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు.
వై వి సుబ్బారెడ్డి చెప్పినట్టు విశాఖకు అన్ని హంగులు ఉన్నాయని తెలిపారు. అవసరాన్ని బట్టి ఐటి, పర్యాటక మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖల భవనాలను అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రి విశాఖలో నివాసం ఉండడానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులు చేయాలని నిర్ణయం తీసుకుందని.. దానికి అందరం కట్టుబడి ఉన్నామని వివరించారు.