పిల్ల చేష్టల ఫలితం: జగన్ పనిని సులువు చేసేసిన చినబాబు!

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, 2019 ఎన్నికల సమయంలోనూ తనదైన భాషాప్రావిణ్యంతో.. తనదైన వాక్ చాతుర్యంతో.. ప్రత్యుర్ధలకంటే ఏమీ తక్కువకాకుండా సొంత పార్టీనే ఇరకాటంలో పాడేసిన పనితనం లోకేష్ సొంతం! ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీచేస్తున్న నియోజకవర్గం పేరును కూడా సరిగ్గా పలకలేకపోవడం పీక్స్! ఆ మాటల సంగతి అలా ఉంటే… ఇక తాజాగా సభలో లోకేష్ చేసిన చేతల వల్ల పెద్ద సమస్యలే తెచ్చిపెట్టబోతోన్నాయి!


వివరాల్లోకి వెళ్తే… శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో రాష్ట్రంలో అత్యంత బలంగా అధికారంలో ఉన్నా కూడా.. మండలి విషయానికి వచ్చే సరికి అనేక బిల్లులను మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో వైఎస్ జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుతం శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇదే సమయంలో అది రద్దయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో ఇప్పటికే శాసనమండలిలో డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, శమంతకమణి వైసీపీలో చేరిపోవడంతోపాటు శివనాధ్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇప్పటికే ఈ వరుసలో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే… మండలిలో చినబాబు కుర్చీని తీసేయాలని జగన్ నెక్స్ట్ ప్లాన్ గా పెట్టుకున్నారంట. అలా జరిగితే… ఆపరేషన్ ఆకర్ష మరీ సులువైపోతుందనేది జగన్ భావన కావొచ్చు!

దీనికి సరిపడా సరైన అవకాశం కోసం చూస్తున్న దశలో.. లోకేష్ చేసిన ఒక కుర్ర చేష్ట వల్ల జగన్ పని చాలా సులవైందని అంటున్నారు! శాసనమండలి జరుగుతున్న సమయంలో నారా లోకేష్ తన ఫోన్ తో ఫొటోలు, వీడియోలు తీస్తూ కనిపించిన సంగతి తెలిసిందే! ఇది సభాహక్కుల ఉల్లంఘన అన్న సంగతి తెలిసి చేశారా.. తెలియని కుర్రతనంతో చేశారా.. అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… ఈ పిల్ల చేష్టపై ఎథిక్స్ కమిటీతోపాటు ఛైర్మన్ కు కూడా ఫిర్యాదు చేసింది ప్రభుత్వం.

ఈ విషయంలో ఎథిక్స్ కమిటీ ద్వారా నారా లోకేష్ పై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకుని.. అనంతరం అది అమలు జరిగేలా ఛైర్మన్ పై వత్తిడి తెచ్చిన పక్షంలో… చినబాబును సాగనంపే పని సాఫీగా జరిగిపోతుందని భావిస్తోన్నారట జగన్! అంతా అనుకూలంగా జరిగితే ఈ రాజధాని బిల్లుల ఆమోదం, కేబినెట్ విస్తరణ అనంతరం.. జగన్ .. చినబాబు పనే పెట్టుకోవచ్చని అంటున్నారు!!