ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరు: జేపీ నడ్డా

విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యకర్తల సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరని నడ్దా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు లండన్ నుంచి మాట్లాడుతున్నారని అన్నారు. వైయస్సార్సిపి, టిడిపి, టిఆర్ఎస్ అన్ని కుటుంబ పార్టీలేనని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ ముందుకు నడిచే పార్టీ బీజేపీ మాత్రమేనని నడ్డా తెలిపారు. దేశం కోసం పనిచేసే పార్టీ, కుటుంబ ప్రమేయం లేని పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు.

రాజనీతి అనే పదానికి ప్రధాని మోదీ సరికొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిని అవుతానని లక్ష్మణ్ కు చివరివరకు తెలియదన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు బిజెపి ఉందన్న నడ్డా.. మార్పు కోసం ప్రతి ఇంటి తలుపు తట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం పెద్ద ఎత్తున ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది అన్న ఆయన..ఆ లాభాలు బూత్ స్థాయిలో పేదలకు అందుతున్నాయో లేదో చూడాలన్నారు. కార్యకర్తల అందరి ఇళ్లపైన పార్టీ జెండా రెపరెపలాడాలి అన్నారు.