అవినాష్ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

-

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో తేలితే… అవినాష్‌ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ వీడే అవకాశం ఉంది.

అవినాష్ రెడ్డి ఏప్రిల్ లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. రోజూ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రాతపూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలంటూ… సీబీఐకి సూచించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా విచారణ చేపట్టాలంటూ ఏప్రిల్ 24న ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 27, 28 తేదీల్లో విచారణ చేపట్టినప్పటికీ… వాదనలు పూర్తి కాకపోవడంతో జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడంతో అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి అవసరమైన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news