ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో లోకేష్ ఇరుక్కున్నట్లేనా… ? వేమూరి తడబాటు

-

చంద్రబాబునాయుడు హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైబర్ గ్రిడ్డ కుంభకోణంలో నారా లోకేష్ ఇరుక్కున్నట్లేనా ? తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోకేష్ తో   ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక వ్యక్తి వేమూరి హరికృష్ణప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తర్వాత లోకేష్ పాత్రపై అనుమానాలు మరింతగా బలపడుతోంది. ఫైబర్ గ్రిడ్ ఫైలుపై పంచాయితీరాజ్, ఐటి శాఖల మంత్రి లోకేష్ సంతకాలు చేశారని ఓ ప్రశ్నకు వేమూరి సమాధానమిచ్చారు. ఇక్కడే లోకేష్ తో పాటు వేమూరి కూడా అడ్డంగా దొరికిపోయారు. ఎలాగంటే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అన్నది నేరుగా చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచిన సంస్ధ.

పెట్టుబడులు, మౌళిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలోనే ఈ ఫైబర్ గ్రిడ్ సంస్ధ కూడా పనిచేస్తుంది. కాబట్టి పై శాఖకు సంబంధించిన ఏ ఫైలుపైన అయినా చంద్రబాబు మాత్రమే సంతకాలు చేయాలి. కానీ చంద్రబాబు అందుబాటులో లేనికారణంగా ఫైలుపై లోకేష్ సంతకం చేసినట్లు స్వయంగా వేమూరే అంగీకరించారు. అంటే ముఖ్యమంత్రి దగ్గరున్న శాఖపైన దానికి సంబంధించిన ఫైలుపై లోకేష్ ఎలాగ సంతకం చేస్తారు ? ఒక మంత్రి నిర్వహిస్తున్న శాఖ ఫైలుపై మరో మంత్రి సంతకం చెల్లదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది సీఎం సంతకం చేయాల్సిన ఫైలుపై ఎంత కొడుకైనా ఎలా సంతకం చేశాడనే ప్రశ్న దగ్గరే లోకేష్ దొరికిపోయాడు. లోకేష్ తో పాటు వేమూరి కూడా దొరికిపోయినట్లే అర్ధమవుతోంది.

ఫైబర్ గ్రిడ్ పేరుతో టిడిపి ప్రభుత్వంలో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నది ప్రభుత్వం ఆరోపణ. వైసిపి ప్రభుత్వంలోకి రాగానే ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపైన కూడా మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించింది. కేబుల్ టివి, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కోసం చంద్రబాబు ప్రత్యేకంగా ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 12 లక్షల సెట్ టాప్ బాక్సులను కూడా కొనుగోలు చేసిందట. అయితే మార్కెట్ లో రూ. 2200కే మంచి సెట్ టాప్ బాక్సు దొరుకుతుంటే అప్పట్లోనే ఒక్కో బాక్సును రూ. 4400 పెట్టి కొన్నది.

ఇలా కొనుగోలు చేసిన సుమారు 12 లక్షల బాక్సుల్లో అప్పట్లోనే సుమారు 3.5 లక్షల బాక్సులు పనిచేయలేదనే ఆరోపణలున్నాయి. ఇదే సందర్భంగా మరో 4 లక్షల బాక్సులు కనబడకుండా మాయమైపోయినట్లు ఆరోపణలు. ఈ సెట్ టాప్ బాక్సులు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలోనే తయారవ్వటం ఇక్కడ గమనార్హం. సరే రాజకీయ పరంగా  చూస్తే ప్రభుత్వం చెబుతున్న ఈ కుంభకోణంపై అసలు ఇపుడు వేమూరి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. అయితే తమ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఎటువంటి విచారణ కూడా జరగకూడదని టిడిపి నేతలు కోర్టులో స్టే తెచ్చుకున్నారు.

ఈ విషయం ప్రస్తుతం బాగా వివాదాస్పదమైంది. ఇంతటి సున్నితమైన విషయంలో వేమూరి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఎందుకు పెట్టారో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా చంద్రబాబు సంతకం చేయాల్సిన ఫైలుపై లోకేష్ సంతకం చేశారని చెప్పిన వేమూరి తర్వాత లోకేష్ సంతకం చేశానని చెప్పింది తప్పని సమర్ధించుకోవటం గమనార్హం. ఫైలుగా లోకేష్ సంతకం చేసినట్లు తాను తప్పుగా చెప్పానని సవరించుకోవటంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఈ కుంభకోణం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news