మాకు ‘ఇదేం ఖర్మరా, బాబూ! అంటూ నారా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఇష్టారాజ్యంగా అధికారం చెలాయించిన నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే భయం పట్టుకుంది. అందుకేనేమో, ‘ఈ ప్రభుత్వానికి భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని మనమే పుట్టించాలి,’ అంటూ మొన్నీమధ్య విజయనగరంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు ‘దిశానిర్దేశం’ చేశారు ఈ పెద్ద మనిషి అని చురకలు అంటించారు.
ప్రజారంజకంగా, ఏ మాత్రం దిగులు లేకుండా పరిపాలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ దివాళాకోరు పార్టీ భయం పుట్టించడం అసలు జరిగే పనేనా? కాని, ఊహల్లో విహరిస్తున్న టీడీపీ నేత మాత్రం అధికారం లేదనే కుంగుబాటుతో జావగారిపోతున్న పార్టీ కార్యకర్తలను అరాజక మార్గంలో నడిపించడానికి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జనసంక్షేమమే లక్ష్యంగా సాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి భయాందోళనలు, అనుమానాలు లేకుండా ముందుకు సాగుతోందని వివరించారు.
చక్కటి కార్యక్రమాలతో నిరంతరం ప్రజల మధ్యనే పనిచేస్తూ ఏడాది నాలుగు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవడానికి సమాయత్తమౌతోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా అధికార వికేంద్రీకరణతో ప్రజల గడపలకే పాలన తీసుకొస్తోంది. ఇవేమీ కళ్లతో చూడలేని చంద్రబాబు అధికారం కోసం అలమటించిపోతున్నారు. మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలుపు నీటి మీద రాతేనని తెలిసినా పార్టీని బతికించుకోవడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుంటే–‘ ప్రస్తుత ప్రభుత్వం పాలనలో మీలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?’ వంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తన రోడ్ షోలకు వచ్చిన వారిని వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి.