తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని అన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నేడు కడప జిల్లాలో న్యాయవాదులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు న్యాయశాఖకు అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మొదటి మూడేళ్లలోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ దాడులపర్వం చివరకు న్యాయవాదుల పైన సాగిందన్నారు. న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయారని అన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని, నామినేటెడ్ పదవులలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.