ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ?

-

తెలుగుదేశం పార్టీని నందమూరి వంశం నుంచి, నారా కుటుంబం లాగేసుకోవడంపై మొదట్లో నందమూరి కుటుంబంలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉన్నా, ఏం చేయలేని పరిస్థితుల్లో అంతా సర్దుకుపోయి, చంద్రబాబుకు జై కొడుతూ వస్తున్నారు. మొదట్లో టిడిపిలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కు బాగానే ప్రాధాన్యం ఇచ్చినా, ఆ తర్వాత పక్కన పెట్టడంపై నందమూరి కుటుంబ సభ్యుల్లోనూ ఆగ్రహం ఉంది. గతంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ కు సైతం, తన తండ్రికి తగిన ప్రాధాన్యం పార్టీలో దక్కలేదనే అసంతృప్తి ఉంది. అయినా మౌనంగానే ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉండటం, పార్టీ కార్యకర్తల్లో నిరాశా నిస్పృహలు అలుముకోవడం, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని, అలా చేస్తే పార్టీ పూర్తిగా నాశనం అవుతుందనే భయం టీడీపీ క్యాడర్ లో ఉంది.


లోకేష్ పార్టీని ముందుకు నడిపించే అంత సామర్ధ్యం, అర్హతలు ఆయనకు లేవని, సొంత పార్టీలోనే మెజారిటీ నాయకుల అభిప్రాయం. ఇప్పుడు కాకపోతే, మరికొద్ది రోజుల్లో అయినా, తెలుగుదేశం పార్టీ నందమూరి వారసులు చేతికి వెళ్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి, మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకు వస్తారనే ఆశలో చాలా మంది టిడిపి నాయకులు ఉన్నారు. కానీ లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆ సాహసం చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివ్ చేస్తే, లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే.

అందుకే వీలైనంత దూరంగా ఎన్టీఆర్ ను భవిష్యత్తులోనూ పెడతారు. అందులో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం లోటు చాలా స్పష్టంగా ఉంది. పార్టీలో సీనియర్ నాయకుల హవా ఎక్కువగా ఉన్నా, వారంతా వయసురీత్యా యాక్టివ్ గా ఉండలేని పరిస్థితి. ఇలా అనేక కారణాలతో టిడిపి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. అది ఎలాగో జరిగే పని కాదు కాబట్టి చంద్రబాబు అవకాశం ఇవ్వరు కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీని పెడితే ఫలితం ఉంటుందని, టిడిపిలో నిరాశ నిస్పృహల్లో ఉన్న నాయకులంతా జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వస్తారని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

అలాగే నందమూరి అభిమానుల అండదండలు జూనియర్ కు లభిస్తాయని, లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడుపలేరు కాబట్టి, రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఆ పార్టీలోని కీలక నాయకులంతా జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వస్తారని విశ్లేషణలు మొదలయ్యాయి. దీనికితోడు సామాజిక వర్గం అండదండలు కూడా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువగా ఉంటుందని, ఇలా అనేక కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ పెరిగిపోతోంది. జూనియర్ కూడా ఇదేరకమైన అభిప్రాయంతో ఉన్నారని, దీనికి సంబందించిన కసరత్తు జరుగుతోందనే గుసగుసలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news