తిరుప‌తిలో వైసీపీ ఊపు ఎందుకు త‌గ్గింది… !

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గనుంది. ఇప్ప‌టికే టీడీపీ అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి పేరు ఖ‌రారైంది. మొన్న దుబ్బాక ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ ముందుగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి ప్ర‌చారంలో దూసుకు వెళ్లి గోల్ కొట్టేసింది. అక్క‌డ టీఆర్ఎస్ గెలుస్తామ‌న్న అతి ధీమాతో బోర్లా ప‌డింది. ఇప్పుడు తిరుప‌తిలోనూ టీడీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే… అధికార వైఎస్సార్‌సీపీ మాత్రం అభ్య‌ర్థి ఎంపిక‌లో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. సాధార‌ణంగా ఉప ఎన్నిక‌ల్లో మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కే టిక్కెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తిరుప‌తి విష‌యంలో మాత్రం జ‌గ‌న్ భిన్న‌మైన ఆలోచ‌న‌తో ఉండ‌డంతో వైసీపీ అభ్య‌ర్థిపై మ‌ల్ల‌గుల్లాలు త‌ప్ప‌డం లేదంటున్నారు.

మృతి చెందిన బల్లి దుర్గాప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌కు సీటు ఇవ్వ‌డం జ‌గ‌న్‌కు ఇష్టం లేదంటున్నారు వైసీపీ నేత‌లు. బ‌ల్లి కుమారుడు బ‌ల్లి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి మాత్రం బ‌య‌ట తిరుగుతూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అయితే స్టార్ట్ చేశారు. తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌ను క‌లుస్తూ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. బ‌ల్లి కుటుంబానికి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇష్టంలేదంటూ వ‌స్తోన్న వార్త‌లు అన్ని ఫేక్ అని క‌ళ్యాణ్ చక్ర‌వ‌ర్తి చెప్ప‌క‌నే చెప్పారు. తాజాగా అభ్య‌ర్థి ఎంపిక‌పై ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశం కూడా అసంపూర్తిగానే ముగిసిన‌ట్టు తెలుస్తోంది.

ముందుగా హైద‌రాబాద్‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త మ‌ధు పేరును ఓ మంత్రి తెర‌మీద‌కు తెచ్చారు. త‌ర్వాత బ‌ల్లి కుటుంబం లైన్లోకి రావ‌డంతో కాస్త సందిగ్థ‌త నెల‌కొంది. జ‌గ‌న్‌కు మాత్రం బ‌ల్లి కుటుంబానికి ఈ సీటు ఇవ్వ‌డం ఇష్టంలేద‌ని… అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు తేల్చ‌లేద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ మ‌దిలో త‌న‌కు పాద‌యాత్ర స‌మ‌యంలో ఫిజియో థెర‌పిస్ట్‌గా చేసిన ఓ డాక్ట‌ర్ పేరు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థి విష‌యంలోనే నాన్చుతూ వ‌స్తోన్న వైసీపీకి ఇప్పుడు ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఊపు కూడా త‌గ్గింద‌నే అంటున్నారు.

నాటి మెజార్టీ 2.28 ల‌క్ష‌లు… నేటి ప‌రిస్థితి ఏంటో…?

గ‌త యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎంపీ సీటును వైసీపీ ఏకంగా 2.28 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజార్టీతో గెలుచుకుంది. పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గ ప‌రిథిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇప్పుడు వైసీపీ ఏకంగా 3 ల‌క్ష‌ల మెజార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నా అంత సీన్ లేద‌నే తెలుస్తోంది. దుబ్బాక‌లో కూడా టీఆర్ఎస్ రెండేళ్ల క్రితం 62 వేల మెజార్టీ చూసుకుని ఇప్పుడు ల‌క్ష మెజార్టీ టార్గెట్‌గా పెట్టుకుని ఓడిపోయింది. ప్ర‌స్తుతం తిరుప‌తిలో వైసీపీకి సానుకూల ప‌రిస్థితులే ఉన్నాయి. అయితే 3 ల‌క్ష‌ల మెజార్టీ కాదు క‌దా.. క‌నీసం గ‌త ఎన్నిక‌ల్లో తెచ్చుకున్న 2.28 ల‌క్ష‌ల మెజార్టీ కూడా రాద‌నే విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో తిరుప‌తిలో టీడీపీ, జ‌న‌సేన రెండు బ‌లంగానే ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చి చూస్తే గూడూరులో వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. వెంక‌ట‌గిరి వైసీపీలో గ్రూపుల గోల‌తో అక్క‌డ టీడీపీ పుంజుకుంది. నెల్లూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చి చూస్తే వైసీపీ గ్రాఫ్‌ మూడు సెగ్మెంట్ల‌లో ప‌డింద‌న్న‌ది వాస్త‌వం. చిత్తూరు జిల్లాలో తిరుప‌తితో పాటు శ్రీకాళ‌హ‌స్తిలో కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త ఉంది. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి మాత్రం చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు సెగ్మెంట్ల బాధ్య‌త‌ల‌ను తాను తీసుకుంటాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ గెలుపు /  మెజార్టీలో గ‌తంలోలా ఉండ‌వ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.