హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్ఆర్ పేరుని పెట్టడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు బాలకృష్ణ. ” మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు.
మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు.. పంచభూతాలు ఉన్నాయి.. తస్మాత్ జాగ్రత్త. మహనీయుడు పెట్టిన బిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు.. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అంటూ బాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పరోక్ష కారణమని విమర్శించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. చంద్రబాబుతో బాలకృష్ణ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. సినిమాలు లేనప్పుడే బాలకృష్ణ రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు.