వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అధోగతి పాలు చేశారన్న ఆయన.. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది అని దుయ్యబట్టారు. గుండ్లకమ్మ గేటు పోయి మూడు సంవత్సరాలైనా పెట్టలేని దుస్థితిలో నాటి వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, పులిచింతల గేటు కొట్టుకుపోయింది. వైసీపీ నేతల ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్లపాటు నోరు తెరవక పోవటం మంచిది.. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.