వైసీపీలో యంగ్ క‌మ్మ కోట‌రీ హ‌వా మొద‌లైందా…!

రాజ‌కీయాల్లో ఇప్పుడు అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. అయితే, ఒక్కొక్క సామాజిక వ‌ర్గానికి కొన్ని పార్టీలే ప్రాధాన్యం ఇస్తున్నాయ‌నే టాక్ ఉంది. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు టీడీపీ త‌ప్ప ఇత‌ర పార్టీల్లో ప్రాధాన్యం లేద‌నే ప్ర‌చారం ఉంది. కాంగ్రెస్ అంటే (గ‌తంలో) రెడ్డి పార్టీ.. టీడీపీ అంటే.. క‌మ్మ పార్టీ అనే ముద్ర‌లు ప‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీ అంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప‌ట్టుకొమ్మ అనే పేరు వ‌చ్చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ పార్టీలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కూడా ప్రాధాన్యం ల‌భిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

క‌మ్మ వ‌ర్గానికి చెందిన కృష్ణాజిల్లా నాయ‌కుడు ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి సీఎం జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో మంచి పొజిష‌న్ ఇచ్చారు. అదేవిధంగా టీడీపీలో గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా వైసీపీలోనూ క‌మ్మ వ‌ర్గానికి ప్రాధాన్యం ఉంటుంద‌నే సంకేతాలు పంపించారు. వీరిద్ద‌రే కాకుండా వైసీపీలో ఉప్పుడున్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ నేత‌లు కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో దేవినేని అవినాష్‌, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, కొఠారు అబ్బ‌య్య చౌద‌రి,  నంబూరు శంక‌ర్రావు, అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌, బాచిన‌ కృష్ణ‌చైత‌న్య‌, త‌ల‌శిల ర‌ఘురామ్ వంటి వారు కూడా ఉన్నారు.

నిజానికి క‌మ్మ వ‌ర్గానికి చెందిన యువ నేత‌ల‌కు ఇప్ప‌టికిప్పుడు చెప్పుకోద‌గ్గ ప‌ద‌వులు లేక‌పోయినా.. భ‌విష్య‌త్తులో మాత్రం వారికి వైసీపీలో మంచి ప‌ద‌వులు, గుర్తింపు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కొడాలి నాని, వంశీ లాంటి సీనియ‌ర్లను ప‌క్క‌న పెడితే పైన చెప్పిన క‌మ్మ యువ‌నేత‌లు అంద‌రూ జ‌గ‌న్ కోట‌రీలో కీల‌కం కానున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ నుంచి యువ క‌మ్మ‌ నేత‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఎక్కువ‌గా ప్రొజెక్ట్ కానున్నారు.

ప‌రిటాల శ్రీరాం వంటివారు కూడా ఫేమ‌స్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు వైసీపీలో ప్ర‌స్తుతం ఉన్న క‌మ్మ‌ యువ నేత‌ల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తార‌ని, వ‌చ్చేసారి వారికి మంచి ప‌ద‌వులు ఇస్తార‌ని పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.