వివాదానికి కేంద్రంగా మారిన వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యవహారం.. పార్టీలోనే కాకుండా.. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారింది. ఏకుగా ఉంటూనే మేకుగా మారిన ఈ ఎంపీ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమైన విషయం తెలి సిందే. ప్రస్తుతం ఈయన వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నాయకులు నేరుగా జగన్‌కు ఫిర్యాదు చేయడం మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రెండు రోజుల అసెంబ్లీ వ్యవహారాలు నడుస్తున్నందున త్వరలోనే ఎంపీపై జగన్ నిర్ణయం తీసుకుంటా రని అంటున్నారు. అదేసమయంలో ఈ వివాదాన్ని మరింత నేర్పుగా ఎంపీకే చుట్టేలా కూడా వైసీపీలో ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి పార్టీ నుంచి వెళ్లిపోయి.. బీజేపీ కండువా కప్పుకోవాలని రఘురామకృష్ణరాజుకు ఉందనే విషయం ఆయన సన్నిహితు లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆది నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలను ప్రసంశిస్తుండడం, వారితో సంబం ధాలు పెట్టుకోవడం వంటివి అందరికీ తెలిసిన విషయమే.తనకు పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ హోదా నేరుగా ప్రధాని మోడీ, అమిత్ షాల వల్లే వచ్చిందని ఆయన చెప్పుకోవడాన్ని బట్టి ఆయనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాలను బహిర్గత పరుస్తోంది. పైగా తాను జగన్ ఫొటో పెట్టుకుని గెలవలేదని, తనంతట తానుగా గెలుపొందానని, తన ఫొటో పెట్టుకుని వైసీపీ ఇక్కడ గెలిచిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కనుమూరి ఆశిస్తున్నట్టుగా.. పార్టీతో వేటు వేయించుకుని .. మీడియాలో సింపతీ తెచ్చుకోవాలని చూస్తున్నట్టు గా కాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలనే ఆయుధాలుగా మార్చుకుని ఆయనపై యుద్ధం చేయాలని జిల్లా వైసీపీ నేతలు భావిస్తు న్నారు. ఎలాగూ… ఆయన చెప్పినట్టు.. జగన్ ఫొటోతో గెలుపు గుర్రం ఎక్కలేదు కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఎంపీ పదవికి రాజీనా మా చేసి.. స్వతంత్రంగా గెలిచి చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే.. పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన కోర్టులోకే వివాదాన్ని నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనికి కనుమూరి అంగీకరించని పక్షంలో.. ఆయన వైసీపీలో జగన్ ఫొటో పెట్టుకుని గెలిచినట్టుగానే భావిస్తామని వారు వెల్లడించారు. సో.. ఇప్పుడు పార్టీ నేరుగా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. తనంతట తానుగానే పార్టీ నుంచి వెళ్లడమా.. ఉండడమా? అనేది నిర్ణయించుకునేలా ఎత్తు వేస్తుండడం గమనార్హం. మరి కనుమూరి ఏం చేస్తారో చూడాలి.