అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం వ్యవహారంలో బిజెపి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడే ఆలోచనలో ఉన్న బీజేపీ, రథం రాజకీయంతో ఏపీలో పాగా వేయాలని, అధికార పార్టీ దూకుడు కు కళ్లెం వేసేందుకు ఈ అంశాన్ని బాగా వాడుకోవాలని గట్టిగానే ప్రయత్నించింది. అసలు ఈ రథాలు అన్నా, దేవాలయాలు అన్న పేటెంట్ తమదే అన్నట్లుగా వ్యవహరించే బిజెపి ఈ సంఘటన ద్వారా బలం పుంజుకోవడానికి ప్రయత్నాలు చేసినా, ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు సరి కదా ఇప్పుడు అది అటు తిరిగి, ఇటు తిరిగి జగన్ ఖాతాలో పడిపోయింది. బీజేపీ, జనసేన, టిడిపి ఆడుతున్న రథం నాటకానికి జగన్ ముగింపు పలికేశారు.
అప్పటివరకు జగన్ కు శాపనార్ధాలు పెట్టిన బిజెపి, జనసేన పార్టీ ల నోళ్ళు మూత పడిపోయాయి . ఈ వ్యవహారాన్ని సిబిఐ కు అప్పగించడం ద్వారా జగన్ ఒక్కసారిగా అందరి నోళ్లకు తాళం వేశారు. ఇప్పటి వరకు జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిన వారికి, ఆ క్రెడిట్ దక్కకుండా మొత్తం క్రెడిట్ అంతా జగన్ కొట్టేసారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఈ అంశంపై నోరు ఎత్తేందుకు అవకాశం లేదు. ఇక ఎవరూ ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేయడానికి లేదు.
ఎందుకంటే సీబీఐ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ. వారిపై ఆధిపత్యం కేంద్రానికే ఉంటుంది. ఈ దర్యాప్తులో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఫలితం ఎలా వచ్చినా, అందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుందనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇదంతా ఇలా ఉంటే, ఏపీలో బీజేపీ ని పరుగులు పెట్టించాలని చూస్తున్న సోము వీర్రాజు కు అంతేర్వేది ఘటనతో మరింత బలపడదామని చూశారు. హిందూ కార్డు తో అంతర్వేది ఘటన ద్వారా బలం పెంచుకుందామని గట్టిగానే కష్టపడ్డారు.కానీ అదేదీ వర్కౌట్ కాలేదు.
బీజేపీ ముందుగా ఊహించినట్టుగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి వేరు, ఇక్కడి పరిస్థితి వేరు. కానీ ఇది అర్థం చేసుకోకుండా బిజెపి ఈ విషయంలో కాస్త ఎక్కువ చేసిందనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. బీజేపీతో పాటు, జనసేన సైతం ఈ వ్యవహారంలో అభాసుపాలైంది. ఇక చేసేది లేక జగన్ తీసుకున్న నిర్ణయంను తాము అభినందిస్తున్నాము అంటూ ఒక ప్రకటనను విడుదల చేసి బిజెపి జనసేన పార్టీలు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
-Surya