మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంకు చెందిన ఈ మాజీ మంత్రి గత కొద్ది రోజులుగా వివాదాలకు తావిస్తున్న విధంగా వ్యాఖ్యలు చేస్తూ మీడియా ఎదుట నిలుస్తున్నారు. ఒంగోలు మినీమహానాడులో కూడా ఆయన ఈ విధంగానే వ్యాఖ్యలు చేశారు. చోడవరంలో నిన్నమొన్నటి వేళ నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఇదేవిధంగా దురుసు మాటలు మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఇంటి గోడను అధికారులు కూల్చేశారు. దీంతో ఆ కుటుంబం ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఉంది. తాము అన్ని పత్రాలూ తీసుకున్నా కూడా ఈ విధంగా అధికారులు జులం చేయడం ఏం బాలేదని అంటోంది. అయితే ఇదే అయ్యన్న పాత్రుడు ఆ ప్రాంతంలో ఇప్పటి ఎమ్మెల్యే గణేశ్
(పెట్ల ఉమాశంకర్ గణేశ్) ఇల్లు కట్టు కుంటుండగా, అప్పటి అధికార దర్పంతో ఆయన్ను ఇబ్బందులు పాల్జేశారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎక్కడిదాకా పోతుందో అని అప్పట్లో చాలా మంది ఆందోళన చెందారు.
తాజా పరిణామాల కారణంగా మళ్లీ నర్సీపట్నంలో వివాదాస్పద వాతావరణమే నెలకొంది. ఆ రోజు టీడీపీ నేతలు వైసీపీ నేత ఇంటి నిర్మాణంపై అభ్యంతరాలు చెప్పారు. ఇప్పుడు అయ్యన్న ఇంటి విషయమై వైసీపీ నేతలు అదే చేస్తున్నారు. చెల్లుకు చెల్లు.. దెబ్బకు దెబ్బ అన్న విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక అయ్యన్న పాత్రుడు ఎక్కడ? ఇప్పటిదాకా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నిన్నటి వేళ ఛలో నర్సీపట్నం కార్యక్రమాన్ని ఆయన కుమారుడు విజయ్ నిర్వహించి నిరసన తెలిపారు. అప్పుడు కూడా అయ్యన్న లేరు. అదేవిధంగా తనకు నోటీసులు వస్తాయని తెలిసి ఆయన ఊళ్లో లేకుండా పోయారు. ఇప్పుడు ఆయన హైద్రాబాద్ లో ఉన్నారని సమాచారం. మరి! పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారా ? లేదా ఎప్పటిలానే కోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు ఏమయినా తెచ్చుకుంటారా ?