తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలా కాకుండా కేసిఆర్ గాని ముందస్తుకు వెళితే..ఏప్రిల్ లేదా మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందస్తుకు వెళ్లాలా? లేదా? అనేది కేసిఆర్ ఆలోచన బట్టి ఉంది. కేసిఆర్ దాదాపు ముందస్తు ఆలోచన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అందుకే అన్నీ పార్టీలు ముందస్తుకు రెడీ అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైంది. బిఆర్‌ఎస్, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో తిరుగుతున్నాయి. అయితే ఎన్నికల వేళ తెలంగాణలో పాదయాత్రలు నడుస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అటు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర మొదలుపెట్టారు. హథ్ సే హథ్ కార్యక్రమంలో భాగంగా రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు.
రేవంత్ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పవచ్చు. అటు రేవంత్ పాదయాత్రకు అనుగుణంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మార్చిలో భట్టి పాదయాత్ర మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. బాసరలో పాదయాత్ర ప్రారంభించనున్న భట్టి.. ఖమ్మంలో ముగించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 35 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ నేతలంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది అయితే రేవంత్ ఇప్పటికే కొన్ని స్థానాలని కవర్ చేయగా, భట్టి మరికొన్ని స్థానాలని కవర్ చేయనున్నారు. మరి ఈ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయేమో చూడాలి.