సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతా కారణాలతో చైనా యాప్‌లపై ఇప్పటికే నిషేధం విధించింది భారత్. తాజాగా చైనా సంస్థలకు చెందిన 200 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన ప్రతిపాదనలకు భద్రతాపరమైన అనుమతులు నిలిపేసింది కేంద్ర హోంశాఖ. దేశీయ పరిశ్రమలు, వాణిజ్య విభాగం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా భారత్‌తో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే భద్రతాపరమైన అనుమతులు తప్పనిసరి.
ఈ మేరకు ఏప్రిల్‌లో నూతన మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా హోంశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనా సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలపై హోంశాఖ ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది.హోంశాఖ వద్ద అనుమతుల కోసం నిరీక్షిస్తున్న చైనా సంస్థలు మీడియా, టెలికమ్యూనికేషన్స్, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నప్పటికీ ఒక్క ప్రతిపాదనకు కూడా హోంశాఖ అనుమతులు జారీ చేయలేదని తెలుస్తోంది.