హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఇక్కడి పరిణామాలు మారాయి. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఆసక్తి రేపుతోంది. మొన్నటి వరకు ఈటల ను ఒంటరి చేయాలని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు విఫలమయినట్టు తెలుస్తోంది. తన బలగాన్ని పెంచుకునేందుకు ఈటల మంతనాలు జరపడం సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
మొన్నటి వరకు టీఆర్ఎస్‌కు జై కొట్టిన చాలామంది నేతలు ఇప్పుడు మళ్లీ ఈటలవైపు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారు. హరీష్‌రావు లాంటి ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగినా కూడా ఈటల మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు కూడా టీఆర్ఎస్‌కు భారీగానే షాక్‌లు తగిలాయి.
ఇప్పటికే కమలాపూర్ ఎంపీపీ, మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పి ఈటల రాజేందర్ కు జిందాబాద్ అన్నారు. ఇప్పుడు అదే దారిలో ఈ రోజు మరికొందరు ఈటల వెంట చేరారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ యూత్ విభాగానికి చెందిన ముఖ్యమైన వంద మంది వరకు నాయకులు ఈ రోజు టీఆర్ ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హుజూరాబాద్‌లోని గాంధీ చౌరస్తా వద్దకు వారంతా చేరుకుని తాము ఈటలకు మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. దీంతో టీఆర్ ఎస్‌కు భారీ షాక్ తగిలినట్టు అయింది.