ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటినుండి ప్రారంభంం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఈ సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. రేపటి బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలని అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు రాజధానుల అంశమే అజెండాగా ఈ సమావేశాలు జరగనుండగా.. మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అలాగే వికేంద్రీకరణ పై ప్రజలకు మరిన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం వివరించనుంది. ఇక ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నిత్యావసర ధరలు, శాంతిభద్రతల పైన చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.