భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ కీలక నిర్ణయం

-

ఏపీలో భూ వివాదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై’ సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రతి మండల కేంద్రంలో భూవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు కొనసాగించాలన్నారు.

సర్వే సమయంలో వివాదాల పరిష్కారానికి యంత్రాంగం ఉండాలని.., మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమగ్ర సర్వేలో వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. వ్యక్తిగతంగా భూమి సర్వే కోసం దరఖాస్తు చేస్తే కచ్చితంగా చేయాలని అన్నారు. నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

నెలకు వెయ్యి గ్రామాల చొప్పున చేస్తున్న లక్ష్యాన్ని పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సర్వే వేగవంతం చేయాలని సూచించారు. కాగా..2023 సెప్టెంబరు నాటికి సమగ్ర సర్వే పూర్తి చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

సమగ్ర సర్వే కోసం లీగల్‌ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వే పూర్తయ్యే నాటికి రిజిస్ట్రేషన్‌ సదుపాయం రావాలన్నారు. నమూనా డాక్యుమెంట్‌ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నమూనా పత్రాల ఆధారంగా సులభంగా రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version