రాజకీయాల్లో పెద్ద పెద్ద సంతోషాలే కాదు.. చిన్నపాటి సంతోషాలు కూడా పెద్ద ఆనందాన్నే ఇస్తాయి. ఇప్పుడు చంద్రబాబుకు అమరావతిని అడ్డుకోలేక పోయాననే ఆవేదన, బాధ రెండూ అధికంగానే ఉన్నాయి. ఈ బాధ నుంచి ఆయన ఇప్పట్లో బయటపడే ఛాన్స్ లేక పోవచ్చు. కానీ, ఇంతలోనే ఆయనకు చిన్నపాటి ఆనందం కలిగించే విషయం తెరమీదికి వచ్చింది. అదికూడా తన బద్ధ శత్రువులు ఇద్దరూ ఒకరికొకరు తలపడడం చంద్రబాబుకు ఆనందాన్ని పంచుతోంది. విషయంలోకి వెళ్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లు పరస్పరం.. స్నేహితులు.
ఇద్దరూ ఒకరింటికి ఒకరు వచ్చి.. పరస్పరం కౌగిలించుకుని, సహకరించుకుంటామని చెప్పినవారే. అంతేకాదు.. ఇద్దరికీ బద్ధ శత్రువు చంద్రబాబు. రాజకీయంగానే ఇద్దరికీ ఆయన చాలా దూరం. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఏకమైనప్పుడు చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందారు. ఇక, తన పనిఅయిపోయిందని అనుకున్నారు. అటు తెలంగాణలో కేసీఆర్ బలంగా ఉండడం, ఇటు ఏపీలో జగన్ బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో చంద్రబాబు తనకు రాజకీయంగా ఇక, కష్టకాలమే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయనకు సంతోషం కలిగించే విషయం తెరమీదికి వచ్చింది.
అదే.. నీళ్ల వ్యవహారం. కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా సీమకు నీళ్లు తరలించే ప్రాజెక్టును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, జగన్ దూకుడుతో తెలంగాణలో సాగునీటి సమస్యలు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. దీంతో ఏకంగా నిన్నమొన్నటి వరకు జగన్‌ను పొగిడిన నోటితోనే ఇప్పుడు ఫిర్యాదు లు చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం కోర్టులోకి కూడా వెళ్లింది. కేసీఆర్ తెలంగాణ నీటిని చుక్కకూడా వదులుకోబోమని చెప్పడం.. అదే రీతిలో జగన్ కూడా ఏపీ హక్కులకు భంగం వాటిల్లనిచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ఇరువురి మధ్య పొగ రాజుకుంది.
ఈ నెల 5న ఈ విషయంపై కేంద్రం నేరుగా జోక్యం చేసుకుంటోంది. ఏకంగా ఇద్దరు సీఎంలతోనూ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎజెండా ప్రకారం సీమ ప్రాజెక్టుకు కృష్ణానది నీటిని వినియోగించుకునే విషయంలో గట్టిగా పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక, దీనిని ఆదినుంచి వ్యతిరేకిస్తున్న కేసీఆర్ కూడా అంతే బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహం చెడే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా చంద్రబాబుకు ఆనందం కలిగించే విషయమేనని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉన్నా.. మౌనం పాటిస్తుండడం వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు పరిశీలకులు.