ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఏ పార్టీకి వారు తమకే ఎక్కువ వచ్చాయని అంటున్నారు. అసలు పార్టీల ప్రస్తావన లేని ఎన్నికల్లో గెలుపు మాదే అని పార్టీలు ఎందుకంటున్నాయ్? ఇంతకీ ఏ పార్టీకి ఎన్ని వచ్చాయ్? టీడీపీ వాదనలో నిజమెంత? వైసీపీ చెబుతున్న లెక్కల్లో నిజాలేంటి?
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొత్త చర్చను లేవదీశాయ్. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
తొలి విడత 12 జిల్లాల్లో 2723 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో 1055 పంచాయతీల్లో గెలిచామని టీడీపీ చెబుతోంది. 38 శాతం విజయం తమ మద్దతు దారులే గెలిచారని టీడీపీ చెప్పుకొస్తోంది. ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగినా..కార్యకర్తల పోరాటంతో విజయం వరించిందని ఆ పార్టీ అధినేత ప్రకటించారు. అలాగే బలవంత ఏకగ్రీవాలు పై కోర్టులకు వెళ్లనున్నట్లు ప్రకటించింది టీడీపీ.
మొత్తం సీట్లలో 90 శాతానికి పైగా గెలిచామంటున్నాయి వైసీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ సంబరాలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది వైసీపీ. ఎక్కడ గెలిచారని సంబరాలు అంటూ ప్రశ్నిస్తోంది. తాము గెలిచిన గ్రామాలు, అభ్యర్థుల ఫోటోలతో సహా విడుదల చేస్తాం అని సవాల్ చేస్తుంది అధికార పార్టీ. దీనికి సంభందించి జిల్లాలవారీగా లెక్కలు చెప్పింది.
కృష్ణా జిల్లా (234): ఏకగ్రీవం 23, వైసీపీ 132, టీడీపీ 28, ఇతరులు 4, జనసేన 1
గుంటూరు జిల్లా (337) : ఏకగ్రీవం 67, వైసీపీ 241, టీడీపీ 73, జనసేన 12, ఇతరులు 11
ప్రకాశం జిల్లా (227): వైసీపీ 162, టీడీపీ 60, ఇతరులు 4, సీపీఐ 1
విశాఖ జిల్లా (340) : వైసీపీ 254, టీడీపీ 56, ఇతరులు 29, బీజేపీ-జనసేన 1
శ్రీకాకుళం జిల్లా (321) : ఏకగ్రీవం 39, వైసీపీ 222, టీడీపీ 57, ఇతరులు 2
నెల్లూరు జిల్లా (163) : ఏకగ్రీవం 25, వైసీపీ 80, టీడీపీ 26, ఇతరులు 18, బీజేపీ 1
కడప జిల్లా (206) : వైసీపీ 177, టీడీపీ 25, ఇతరులు 2
అనంతపురం జిల్లా (169) : ఏకగ్రీవం 6, వైసీపీ 134, టీడీపీ 23, ఇతరులు 6
చిత్తూరు జిల్లా (454) : ఏకగ్రీవం 112, వైసీపీ 264, టీడీపీ 70, బీజేపీ 1, జనసేన 1, కాంగ్రెస్ 1, ఇతరులు 5
అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పార్టీల లెక్కలు చర్చనీయాంశంగా మారాయ్. పార్టీల ప్రస్తావనలు లేకుండా జరిగిన ఎన్నికల్లో తమకు ఇన్ని వచ్చాయని ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది.
మొత్తానికి తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వ్యవహారంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో వీటిపై అధికారిక ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది.