సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానానికి స్వస్తి చెప్పి ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను సంక్షేమ పథకాలు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు.
అదే ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి. బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్‌లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని అమలుచేసేందుకు కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్.