నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ, వాటి నివారణ చర్యల పై సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియల నేపద్యంలో తాజాగా రాష్ట్రంలో కొన్ని సంఘటనల పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీనితో ఆయన కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికే కరోనా నుండి కోలుకున్న ప్రతి వ్యక్తికి రూ. 2000 రూపాయలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అలాగే నేడు జరిగిన సమీక్షలో కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో ఏ హాస్పిటల్ కూడా నిరాకరించ కూడదని, ఒకవేళ అలా చేస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హాస్పిటల్ యజమానులకు హెచ్చరిక చేశారు. వీటితో పాటు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కరోనా టెస్టులు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పై ప్రజల నుండి ఫిర్యాదులు అందుకునేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.