అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఆ రాష్ట్ర కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈనెల 12న తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఇచ్చిన నోటిసులపై రైతులు వేసిన పిటిషన్‌ను మొదటి కేసుగా ధర్మాసనం విచారణ జరిపింది.
పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దరఖాస్తును పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు. కోర్టు తీర్పు పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల కోసం మాత్రమే పోరాడతామని.. పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడతామని అన్నారు.