ఏపీకి రెయిన్ అలెర్ట్… ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…

ఏపీని ఇప్పట్లో వానలు వదలేలా లేవు. మరోసారి ఏపీకి వర్షగండం పొంచి ఉంది. గత నెల కాలంగా వరసగా వస్తున్న వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమను వరదలు వణికించాయి. తాజాగా మరోసారి ఏపీకి వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రంత తెలిపింది.

తాజాగా ప్రకాశం, నెల్లూర్, కడప జిల్లాల్లో  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలపింది. క్రిష్ణా, గుంటూర్, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల సూచనల మేరకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. తిరుపతి పట్టణంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి, వర్ష ప్రభావాన్ని సమీక్షించనున్నారు.