పంచ్ ప్రభాకర్ కథ కంచికేనా! ఊచలు లెక్క పెట్టాల్సిందేనా?

పంచ్ ప్రభాకర్. వైఎస్సాఆర్‌సీపీ అభిమాని. జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని. యూట్యూబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా విరుచుకుపడుతుంటారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేస్తుంటాడు. ఒక్కోసారి అవి శ్రుతి మించుతుంటాయి కూడా. నాయకులపై వ్యాఖ్యలు చేయడం వరకు ఒకే కానీ, న్యాయవ్యవస్థపై అనుచితంగా మాట్లాడితే అంతే సంగతులు. ఏ తప్పయితే చేయకూడదో అదే చేశాడు పంచ్ ప్రభాకర్. అందుకు పర్యావసనంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది.

తన యూట్యూబ్ చానల్‌లో న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై విచారణ చేపడుతున్న ఏపీ హైకోర్టు సీబీఐకి అల్టిమేటం జారీ చేసింది. 10 రోజుల్లో ప్రభాకర్‌ను అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ అరెస్టు చేయకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌(సిట్)ను ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటికే రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన సీబీఐ పంచ్ ప్రభాకర్‌ను కటకటాల్లోకి నెట్టేందుకు సిద్ధమవుతున్నది.

న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యూట్యూబ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పంచ్ ప్రభాకర్ చానల్‌‌‌ను తొలగించింది. ఇండియాలో పంచ్ ప్రభాకర్‌ చానల్‌కు సంబంధించిన ప్రసారాలపై నిషేధం విధించింది. కానీ పంచ్ ప్ర‌భాక‌ర్ వీడియోలు ఇంకా అందుబాటులో ఉన్నాయి.