విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎంత విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు? స్లోపింగ్ ఏరియా (నిర్మాణాల పటిష్ఠానికి కొండవాలును చదును చేయడం) ఎంతమేరకు వినియోగించారు? కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్) అనుమతులకు లోబడి పనులు చేపట్టారా? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని బృందాన్ని ఆదేశించింది.
మరోవైపు రుషికొండపై నిర్మాణాల గురించి స్థాయీ నివేదిక సమర్పించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థను హైకోర్టు ఆదేశించింది. స్లోపింగ్ కోసం అదనంగా భూమి వాడుకునేందుకు మీకెవరు అనుమతినిచ్చారంటూ ఆ సంస్థను నిలదీసింది. స్లోపింగ్ కోసం 3.86 ఎకరాలు తవ్వామని మీ అఫిడవిట్లోనే అంగీకరిస్తున్నారని గుర్తు చేసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. నిర్మించాక అనుమతులు కోరడమేంటని ప్రశ్నించింది. మీ అభీష్టం మేరకు అనుమతులు పొందడమేంటని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది.