ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు. ఉద్యమాన్ని కొనసాగించాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయం తీసుకుంది. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అత్యవసర కార్యవర్గం అభిప్రాయపడింది. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటి నుంచి మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. మా ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తామని, ప్రభుత్వం కొన్ని అంశాలకు సానుకూలంగా స్పందించిందన్నారు.
అందుకే ఉద్యమ తీవ్రత తగ్గించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతాం. ఉద్యోగుల ఆవేదన చూసి అయినా ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుతున్నాం. గతంలో చేసిన పోరాట ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేశాం. నేటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చే నెల ఐదు వరకు విధుల్లో పాల్గొంటాం. ఈనెల 17, 20 తేదీలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతాం. 21వ తేదీన సెల్ డౌన్ యధావిధిగా ఉంటుంది. 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తాం. వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.