వైజాగ్ స్టీల్ పై ఏపీ లీడర్లు మళ్లీ పాత తప్పే చేస్తున్నారా..?

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించడంతో.. ఉక్కు నగరంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు మాత్రం షరా మామూలుగా భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు పోరాటానికి సిద్ధమని తొడగొడుతుంటే.. మరికొందరు మాత్రం చూద్దాం.. చేద్దాం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవరికి వారుగా కార్మికుల ఉద్యమానికి మద్దతంటున్నారే కానీ.. ఐక్య పోరాటాలకు ముందుకు రావడం లేదు. విశాఖ స్టీల్ ను కూడా నేతలు రాజకీయం చేస్తున్నారా అన్నదానిపై చర్చ నడుస్తుంది.

కేంద్ర బడ్జెట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించారు. బడ్జెట్ పెట్టిన తర్వాతి రోజు నుంచే స్టీల్ ప్లాంట్ దగ్గర నిరసనలు మిన్నంటుతున్నాయి. కార్మికుల ఉద్యమానికి ప్రజాసంఘాలతో పాటు పలువురు నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే కలిసికట్టుగా కేంద్రంపై పోరాడే విషయంలో మాత్రం ఎప్పటిలాగే ప్రధాన పార్టీలు స్పందించడం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ను దక్కించుకున్న చరిత్ర తెలుగువారికి ఉంది. కానీ అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపగలమా అంటే మాత్రం అవును అని గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే మాట రాగానే.. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాల్సింది పోయి.. ఎవరికి వారే స్వప్రయోజనాలు లెక్కలేసుకుంటున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని సీఎం జగన్ ప్రధానికి లేఖ రాస్తే.. ఉక్కును కాపాడాల్సింది వైసీపీయేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు తేల్చేశారు. పవన్ నేతృత్వంలో ప్రధానిని కలుస్తామని జనసేన ప్రెస్ రిలీజ్ తో సరిపెట్టింది. ఇక బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. సుజనా చౌదరి, జీవీఎల్ లాంటి నేతలు.. ఇది విధాన నిర్ణయం అంటుంటే.. సోము వీర్రాజు, పురంధేశ్వరి లాంటి నేతలు ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నిస్తామని చెబుతున్నారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. ఉక్కు ఉద్యమంపై సానుకూలంగా ఉన్నా.. ప్రధాన పార్టీలు మాత్రం అంతుబట్టని వైఖరి అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ, టీడీపీ చేతులు కలపనిదే ఉద్యమానికి ఊపు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు చేసుకోవడం పక్కనపెట్టి.. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై పోరాడాలని నేతలు సూచిస్తున్నారు. మొదట ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతున్నారు. అప్పుడే ఐక్య కార్యాచరణకు వీలవుతుందని చెబుతున్నారు.

ఏపీలో ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నా.. దానికి ఉద్యమ రూపం ఇవ్వడంలో రాజకీయ పార్టీలు విఫలమౌతున్నాయనే విమర్శ ఉంది. గతంలో ప్రత్యేక హోదా విషయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉద్యమం చేసినా.. రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రాకపోవడంతో.. విషయం నీరుగారిపోయింది. ఇప్పుడు ఉక్కు ఉద్యమం విషయంలో కూడా లీడర్లు పాత తప్పులే చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

కార్మిక సంఘాలు నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని చెబుతున్నాయి. సొంత గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ ను నష్టాల పాలు చేశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు విభజన హామీలు నెరవేర్చలేకపోయినా ఎవరూ అడగలేదు కాబట్టి.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జోలికొచ్చినా ఏమౌతుందిలో అనే ధోరణిలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు గట్టిగా పోరాడకపోతే.. ఢిల్లీలో ఏపీ అంటే చులకనైపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

రెండేళ్ల క్రితం తమిళనాడులో సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామంటే.. అక్కడ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఢిల్లీ పంపించారు. రాజకీయంగా అన్ని పార్టీలూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో.. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన పక్కనపెట్టారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే దారిలో నడవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news